పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

అక్షర క్రమము 83   Prev  /  Next

(తరగతి క్రమము 103)
తపములఁ జేసి యైన మఱి దానము లెన్నియుఁ జేసి యైన నే
జపములఁ జేసి యైన ఫలసంచయ మెవ్వనిఁ జేర్పకున్న హే
యపదములై దురంతవిపదంచితరీతిగ నొప్పుచుండు న
య్యపరిమితున్ భజించెద నఘౌఘనివర్తను భద్రకీర్తనున్
ఛందస్సు (Meter): చంపకమాల
స్కంధము (Chapter): 2
సంఖ్య (Number): 62
శుకుడు తన మనసులో ఈ విధముగా ప్రార్థించుకొనెను. ఈ పద్యము ఈ క్రింది సంస్కృత శ్లోకమునకు పోతనగారు చేసిన తెలుగు అనువాదము:

तपस्विनो दानपरा यशस्विनो मनस्विनो मंतविदः सुमङ्गलाः।
क्षेमं न विननि विना यदर्पणं तस्मै सुभद्रश्रवसे नमो नमः॥

తపస్వినో దానపరా యశస్వినో మనస్వినో మంత్రవిదః సుమఙ్గలాః ।
క్షేమం న విన్దన్తి వినా యదర్పణం తస్మై సుభద్రశ్రవసే నమో నమః ॥
వ్యాఖ్య
శుకుడు పరీక్షిత్తునకు ముక్తి మార్గమును తెలిపిన పిదప, పరీక్షిత్తు ఈ విధముగా నడిగెను: హరి విశ్వమును "ఏ రీతిఁ బుట్టించు రక్షించు బొలియఁ జూచు", "ఏకత్వమున నుండు నీశ్వరుండు భిన్నమూర్తి యగుచుఁ బెక్కు విధంబుల నేల యుండు నతని కేమి వచ్చె నుండకున్న" (2.56). "అనిన నయ్యుత్తరానందను వచనంబులకు నిరుత్తరుండు గాక సదుత్తరప్రదాన కుతూహలుండై లోకోత్తరగుణోత్తరుండైన తాపసోత్తముండు దన చిత్తంబున" (2.57) ఈ పద్యములో చెప్పిన విధముగా ప్రార్థించుకొనెను.

తపములఁ జేసి యైన = (ఎన్ని) తపములను చేసినను
మఱి దానము లెన్నియుఁ జేసి యైన = ఎన్ని దానములను చేసినను,
ఏ జపములఁ జేసి యైన = ఎట్టి జపములను చేసినను,
ఫలసంచయ మెవ్వనిఁ జేర్పకున్న = (వాని మూలమున కలిగే) ఫలితములను ఎవరికి (ఏ భగవంతునికి) సమర్పిచకున్నట్లయితే
హేయపదములై = (ఆ తపములు, దానములు, జపములు) నిరుపయోగమై,
దురంతవిపదంచితరీతిగ నొప్పుచుండున్ = అంతులేని విపత్తులతో కూడి యుండునో,
అయ్యపరిమితున్ భజించెదన్ = ఆ అపరిమితుడైన వానిని (అనంతుని) భజించెదను
అఘౌఘనివర్తను = పాపముల (అఘ) సమూహములను (ఓఘ) నాశనము చేయువానికి,
భద్రకీర్తనున్ = శుభ (వచనములచే) కీర్తింబడువానికి.
సాధన
తపములఁ జేసి యైన మఱి దానము లెన్నియుఁ జేసి యైన నే
జపములఁ జేసి యైన
ఫలసంచయ మెవ్వనిఁ జేర్పకున్న హే
యపదములై
దురంతవిపదంచితరీతిగ నొప్పుచుండు
య్యపరిమితున్ భజించెద
నఘౌఘనివర్తను భద్రకీర్తనున్
tapamula@M jEsi yaina ma~ri dAnamu lenniyu@M jEsi yaina nE
japamula@M jEsi yaina
phalasaMcaya mevvani@M jErpakunna hE
yapadamulai
duraMtavipadaMcitarItiga noppucuMDu na
yyaparimitun bhajiMceda
naghaughanivartanu bhadrakIrtanun
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)