పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

αβ'cal 117   Prev  /  Next

(తరగతి క్రమము 8)
ఒనరన్‌ నన్నయ తిక్కనాదికవులీ యుర్విం బురాణావళుల్‌
తెనుఁగుం జేయుచు మత్పురాకృత శుభాధిక్యంబు దా నెట్టిదో
తెనుఁగుం జేయరు మున్ను భాగవతమున్‌ దీనిం దెనింగించి నా
జననంబున్‌ సఫలంబుఁ జేసెదఁ బునర్జన్మంబు లేకుండఁగన్‌.
ఛందస్సు (Meter): ఉత్పలమాల
స్కంధము (Chapter): 1
సంఖ్య (Number): 21
వ్యాఖ్య
భాగవతగ్రంథ అనువాదమునకు ముందుగా పోతనగారు తనగురించి (కృతికర్త) చెప్పుకున్న పద్యములలో ఒక పద్యం.

ఒనరన్ = చక్కగ;
నన్నయ తిక్కన = నన్నయ మఱియు తిక్కన;
ఆది కవుల్ = మొదలైన కవులు;
ఈ యుర్విన్ = ఈ భూమిలో ని;
పురాణావళుల్ = పురాణముల వరుసలను (అనగా చాలా పురాణములను అని అర్ధము);
తెనుఁగుం జేయుచు = తెలుగు లోనికి అనువదించారు;
మత్ = నా యొక్క;
పురాకృత = పూర్వ దేహపు (అనగా పూర్వ జన్మ కర్మ ఫలము యొక్క అని అర్ధము);
శుభ+ఆధిక్యంబు = అమితమైన అదృష్టము;
తానెట్టిదో = అది ఎటువంటిదో కదా!;
తెనుఁగుం జేయరు = తెలుగొలోనికి అనువాదము చేయలేదు;
మున్ను = ఇదివరకు;
భాగవతమున్ = భాగవతమును;
దీనిం = ఈ భాగవతమును;
తెనింగించి = తెలుగులోనికి అనువదించి;
నా జననంబున్ = నా జన్మమును;
సఫలంబు = సఫలము (worthwhile);
చేసెద = చేయుదును;
పునర్జన్మంబు = ఇంకొక జన్మము;
లేకుండగన్ = లేకుండగా;

హిందూ ధర్మములో ముఖ్యమైన నమ్మకము పునర్జన్మము ఉన్నదని - అనగా ప్రతి మనిషికి ఒక జన్మ అనంతరము మఱియొక జన్మ కలదు అని నమ్ముట. జన్మము-మరణము, మఱల జన్మము-మరణము ఇలా కాల చక్రము మన కర్మలను అనుసరించి, వాసనలకు అనుగుణముగా తిరుగుతు ఉంటుంది. ఇది కర్మ సిద్ధాంతము. అయితే ఈ చక్రములో మనిషి జోక్యం కలిగించుకొనవచ్చును. జోక్యం కలిగించుకొని, అదృష్టవశాత్తునైనా లేదా స్వయం కృషితోనైనా పుణ్య కర్మలను చేసి ఈ జనన మరణ చక్రములనుండి విడులను పొంది మోక్షమును సంపాదించవచ్చును. పోతనగారు ఈ భాగవతమును తెలుగులోనికి అనువదించుట మహా పుణ్యమని, ఈ పుణ్యఫలము ఆయనను ఈ జనన మరణ చక్రములనుండి విడుదల చేసి, ఇంకొక జన్మము లేకుండగా చేయునని నమ్మెను. భాగవతమును సంస్కృతము నుండి తెలుగులో అనువాదము చేయుట ఆయన అదృష్టముగా భావించారు. అందుకనే పూర్వము తిక్కన, నన్నయ లాంటి కవులు ఎందరో అనేక పురాణములను తెలుగునకు అనువదించినా, భాగవతమును తనకోసమే వదిలినట్లు అనుకొని ఆయన ఎంతో ఆనందించారు.
సాధన
ఒనరన్‌ నన్నయ తిక్కనాదికవులీ యుర్విం బురాణావళుల్‌
తెనుఁగుం జేయుచు
మత్పురాకృత శుభాధిక్యంబు దా నెట్టిదో
తెనుఁగుం జేయరు మున్ను భాగవతమున్‌ దీనిం దెనింగించి నా
జననంబున్‌ సఫలంబుఁ జేసెదఁ
బునర్జన్మంబు లేకుండఁగన్‌.
onaran nannaya tikkanAdikavulI yurviM burANAvaLul
tenu@MguM jEyucu
matpurAkRta SubhAdhikyaMbu dA neTTidO
tenu@MguM jEyaru munnu bhAgavatamun dEniM deniMgiMci nA
jananaMbun saphalaMbu@M jEseda@M
bunarjanmaMbu lEkuMDa@Mgan.
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)