పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

గ్రంథ క్రమము 112   Prev  /  Next

(తరగతి క్రమము 108)
ఎందాఁక నాత్మదేహము
నొందెడు నందాఁక గర్మయోగము లటపైఁ
జెందవు, మాయాయోగ
స్పందితులై రిత్త జాలిఁబడ నేమిటికిన్?
ఛందస్సు (Meter): కందము
స్కంధము (Chapter): 7
సంఖ్య (Number): 54
సుయజ్ఞుని మరణమునకు శోకించుచున్న తన భార్యలను చూచి బాలుని వేషమున నున్న యముడు ఇట్లు పలికెను. ఈ పద్యము ఈ క్రింది సంస్కృత శ్లోకమునకు పోతనగారు చేసిన తెలుగు అనువాదము:

यावल्लिङ्गान्वितो ह्यात्मा तावत् कर्म निबन्धनम् ।
ततो विपर्ययः क्लेशो मायायोगोऽनुवर्तते ॥

యావల్లిఙ్గాన్వితో హ్యాత్మా తావత్ కర్మ నిబన్ధనం ।
తతో విపర్యయః క్లేశో మాయాయోగోऽనువర్తతే ॥
వ్యాఖ్య
ఎందాఁక = ఎంతకాలము;
ఆత్మదేహము నొందెడు = ఆత్మ దేహముతో కలసియుండునో;
నందాఁక = అంతకాలము [మాత్రమే];
కర్మయోగముల్ = కర్మములతో చేరిక యుండును.
అటపైఁ జెందవు = ఆ తరువాత [ఆత్మ దేహమును వీడిన తరువాత ఆత్మకు కర్మలు] అంటుకొనవు;
మాయాయోగ స్పందితులై = [మీరు ఈ] మాయ వలన ప్రేరేపితులై;
రిత్త జాలిఁబడ నేమిటికిన్? = వ్యర్థముగా ఏల బాధపడెదరు?

ఇది హిరణ్యకశిపుడు తన తమ్ముని మరణమునకు శోకించుచున్న బంధువులను ఓదార్చుటకు చెప్పిన కథ. ఇందులో సుయజ్ఞుడు అను రాజు మరణమునకు వాని భార్యలు ఎనలేని బాధతో శోకించుచుండగా యముడు బాలుని వేషమున వచ్చి ఇట్లు పలుకసాగెను. పంచభూతములతో ఏర్పడిన ఈ దేహము ఒక భవనము వంటిదని, దీనిలో "పురుషుడు" పూర్వ జన్మ కర్మల వశమున వచ్చి చేరునని, ఎప్పటికైనా ఈ దేహము నశించునుగాని, అందలి పురుషుడు కాదని, కనుక ఈ దేహము, అందలి పురుషుడు వేరువేరని [7.51] పలికి ఇంకా ఈ పద్యములో చెప్పిన విధముగా పలికెను.
సాధన
ఎందాఁక నాత్మ దేహము
నొందెడు
నందాఁక గర్మయోగము లటపైఁ
జెందవు,
మాయాయోగ
స్పందితులై రిత్త జాలిఁబడ నేమిటికిన్?
eMdA@Mka nAtma dEhamu
noMdeDu
naMdA@Mka garmayOgamu laTapai@M
jeMdavu,
mAyAyOga
spaMditulai ritta jAli@MbaDa nEmiTikin?
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)