పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

αβ'cal 89   Prev  /  Next

(తరగతి క్రమము 45)
కొందఱకుఁ దెనుఁగు గుణమగుఁ
గొందఱకును సంస్కృతంబు గుణమగు
రెండుం గొందరికి గుణములగు నే
నందఱ మెప్పింతుఁ గృతుల నయ్యైయెడలన్.
ఛందస్సు (Meter): కందము
స్కంధము (Chapter): 1
సంఖ్య (Number): 20
పోతనగారు భాగవత కథా ప్రారంభమునకు ముందు తనగురించి చెప్పుకొనిన పద్యములలో ఇదియొకటి:
వ్యాఖ్య
కొందఱకుఁ దెనుఁగు గుణమగుఁ = కొందరు (పాఠకులు) తెలుగు అలవాటుగా ఉందురు;
కొందఱకును సంస్కృతంబు గుణమగు = కొందరు (పాఠకులు) సంస్కృత భాష అలవాటుగా ఉందురు;
రెండుం గొందరికి గుణములగు = (ఈ) రెండు భాషలు కొందరకు అలవాటుగా ఉండును;
నే నందఱ మెప్పింతుఁ = నేను (ఈ అనువాదమును) అందరిని (ఈ రెండు విధములయినవారిని) మెప్పించేటట్లుగా;
కృతుల నయ్యైయెడలన్ = కృతులను చేసెదను (పద్యములను, గద్యములను వ్రాసెదను).

కొన్ని కష్టతరమయిన భావనలను, లేదా సాంకేతిక విషయములను చెప్పుటకు లాటిన్ భాష ఇంగ్లీషు భాషకు ఎంత దోహదపడుచున్నదో, అంతకంటే ఎక్కువగా సంస్కృతము తెలుగు భాషకు (నిజముగా అనేక భారతీయ భాషలకు) దోహదపడుచున్నదని చెప్పవచ్చును. ఈ రోజులలోని "తెలుగు" భాష నిజముగా ఎక్కువ సంస్కృత పదజాలముతో నిండియున్నది - పూర్తిగా అచ్చ తెలుగు భాషలో వ్రాసిన గ్రంథాలు ఈ రోజులలో అర్థము చేసికొనవలెనంటే సంస్కృతగ్రంథాలను అర్థము చేసికొనుటకు ఎంత శ్రమపడవలెనో అంత శ్రమపడవలెనని మనము గ్రహించవచ్చు. ఉదాహరణకు అన్నమయ్య కూడా ఇంచుమించు పోతనగారి కాలమునాటికి చెందినవారయినా, కొన్ని అన్నమయ్య రచనలలో ఎక్కువ అచ్చ తెలుగు పదములు గలవు - ఇందు మూలముగా ఆ రచనలను అర్థము చేసికొనుటకు ప్రత్యేక నిఘంటువులను సంప్రదించవలసిన అవసరము కలుగును. పోతనగారి భాగవత అనువాదము ఈ రోజులలోని తెలుగు భాషవలెనే ఎక్కువ సంస్కృత పదజాలముతో నిండియుండును. అంతేగాక కొన్ని పద్యములు, వచనములులో ఇంకా ఎక్కువగా సంస్కృత పదజాలము కనిపించును.

ఉదాహరణకు పోతనగారు గజేంద్రమోక్షము భాగములో పాలసముద్రములోని త్రికూటము అనే పర్వతమును వర్ణించుచు వ్రాసిన వచనములో సంస్కృత పదజాలము చూడుము: "అది మఱియును మాతులుంగ లవంగ లుంగ చూత కేతకీ భల్లూత కామ్రాతక సరళ పనస బదరీ వకుళ వంజుల వట కుటజ కుంద కురవక కురంటక కోవిదార ఖర్జూర నారికేళ సిందువార చందన పిచుమంద మందార జంబూ జంబీర మాధవీ మధూక తాల తక్కోల తమాల హింతాల రసాలసాల ప్రియాళు బిల్వామలక క్రముక మదంబ కరవీర కదళీ కపిత్థ..." (8.24) మరి అదే భాగములోని ఈ క్రింది పద్యములో అచ్చ తెలుగు పదములు దండిగా యున్నవి: క. తొండంబులఁ బూరించుచు / గండంబులఁ జల్లుకొనుచు గళగళరవముల్ / మెండుకొన వలుఁదకడుపులు / నిండన్ వేదండకోటి నీరుం ద్రావెన్. (8.45)
సాధన
కొందఱకుఁ దెనుఁగు గుణమగుఁ
గొందఱకును సంస్కృతంబు గుణమగు
రెండుం గొందరికి గుణములగు నే
నందఱ మెప్పింతుఁ గృతుల నయ్యైయెడలన్.
koMda~raku@M denu@Mgu guNamagu@M
goMda~rakunu saMskRtaMbu guNamagu
reMDuM goMdariki guNamulagu nE
naMda~ra meppiMtu@M gRtula nayyaiyeDalan.
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)