పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

తరగతి క్రమము 109   Prev  /  Next

చిత్రంబులు త్రైలోక్య ప
విత్రంబులు భవలతా లవిత్రంబులు స
న్మిత్రంబులు మునిజన వన
చైత్రంబులు విష్ణుదేవు చారిత్రంబుల్
ఛందస్సు (Meter): కందము
స్కంధము (Chapter): 7
సంఖ్య (Number): 6
"సర్వభూతములకు సముడు" [7.3] యైన భగవంతునకు రాక్షసులతో వైరము చోద్యముగానున్నదని అడిగిన పరీక్షుత్తునకు శుకుడు ఈ విధముగా చెప్పనారంభించెను. ఈ పద్యము, దీనికి పూర్వమున నున్న పద్యము [7.5, 7.6] ఈ క్రింది రెండు శ్లోకములకు పోతనగారు చేసిన తెలుగు అనువాదము.

साधु पृष्टं महाराज हरेश्चरितमद्भुतम् ।
यद् भागवतमाहात्म्यं भगवद्भक्तिवर्धनम् ॥
गीयते परमं पुण्यमृषिभिर्नारदाधिभिः ।
नत्वा कृष्णाय मुनये कथयिष्ये हरेः कथाम् ॥

సాధు పృష్టం మహారాజ హరేశ్చరితమద్భుతమ్ ।
యద్ భాగవతమాహాత్మ్యం భగవద్భక్తివర్ధనమ్ ॥
గీయతే పరమం పుణ్యమృషిభిర్నారదాదిభిః ।
నత్వా కృష్ణాయ మునయే కథయిష్యే హరేః కథామ్ ॥
వ్యాఖ్య
చిత్రంబులు = ఆశ్చర్యము గొల్పునవి / అద్భుతమైనవి;
త్రైలోక్య పవిత్రంబులు = మూడు లోకములయందును పవిత్రములైనవి;
భవలతా లవిత్రంబులు = సంసారపు తీగెల [నరికి వేయు] కొడవళ్ళవంటివి;
సన్మిత్రంబులు = మంచి స్నేహితులవంటివి [శుభములై హితమును/మేలును చేకూర్చునవి];
మునిజన వనచైత్రంబులు = ముని జనులకు [పవిత్రమైన] చైత్రమాసము వంటివి;
విష్ణుదేవు చారిత్రంబుల్ = విష్ణు దేవుని చరితలు [కథలు].

ఏడవ స్కంధమున ప్రధాన ఘట్టము ప్రహ్లాద చరిత్రము. ఈ స్కంధమునకు ఆదిన పరీక్షిత్తు శుకుని ఇలా ప్రశ్నించెను: అన్ని జీవులను సమదృష్టితో చూచు భగవంతుడు ఇంద్రుని కొఱకు రాక్షసరాజులను ఎందుకు చంపెను? దీనివలన భగవంతునికి కలిగెడు లాభమేమిటి? గుణరహితుడు, "నిర్వాణ నాథుండు" అయిన భగవంతునికి రాక్షసులవలన యెట్టి భయము, ద్వేషము కలుగనేరదు కదా! మరి అటువంటివాడు రాక్షసులను చంపి, దేవతలను రక్షించుట చోద్యముగా నున్నది, ఈ సందేహమును నివారింపుము (7.3).

ఈ ప్రశ్నకు సమాధానముగా శుకుడు ఇట్లు చెప్పనారంభించెను:

నీ సంప్రశ్నము వర్ణనీయము గదా, నిక్కంబు, రాజేంద్ర! ల
క్ష్మీ సంభావ్యుని సచ్చరిత్రము మహాచిత్రంబు చింతింపఁ, ద
ద్దాసాఖ్యానము లొప్పు విష్ణుచరణధ్యాన ప్రధానంబులై
శ్రీ సంధానములై మునీశ్వర వచో జేగీయమానంబులై. [7.5]

అయితే ఈ అనువాదముతో పోతనగారు తృప్తినొందలేదు. ఈ శ్లోకములో హరి చరిత్రలు "మహాద్భుమ్" అని, భక్తుల గాథలు "భగవద్భక్తివర్ధనమ్" అని, ఆ పలుకులు "పరమమ్" అని చెప్పబడినది. ఈ మాటలకు పులకితుడై పోతనగారు ఈ కందపద్యమును వ్రాసెను.
సాధన
చిత్రంబులు త్రైలోక్య ప
విత్రంబులు
భవలతా లవిత్రంబులు
న్మిత్రంబులు
మునిజన వన
చైత్రంబులు
విష్ణుదేవు చారిత్రంబుల్
citraMbulu trailOkya pa
vitraMbulu
bhavalatA lavitraMbulu sa
nmitraMbulu
munijana vana
caitraMbulu
vishNudEvu cAritraMbul
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)