పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

గ్రంథ క్రమము 117   Prev  /  Next

(తరగతి క్రమము 106)
పానీయంబులు ద్రావుచుం గుడుచుచున్ భాషించుచున్ హాస లీ
లా నిద్రాదులు సేయుచుం దిరుగుచున్ లక్షించుచున్ సంతత
శ్రీనారాయణ పాదపద్మ యుగళీ చింతామృతా స్వాద సం
ధానుండై మఱచెన్ సురారిసుతుఁ డేతద్విశ్వమున్ భూవరా!
ఛందస్సు (Meter): శార్దూలము
స్కంధము (Chapter): 7
సంఖ్య (Number): 123
నారదుడు యుధిష్ఠురునికి ప్రహ్లాదుని గుణగణములను వర్ణించుచుండెను. ఈ పద్యము ఈ క్రింది సంస్కృత శ్లోకమునకు పోతనగారు చేసిన తెలుగు అనువాదము:

आसीनः पर्यटन्नश्नन् शयानः प्रपिबन् ब्रुवन् ।
नानुसन्धत्त एतानि गोविन्दपरिरम्भितः ॥

ఆసీనః పర్యటన్నశ్నన్ శయానః ప్రపిబన్ బ్రువన్ ।
నానుసంధత్త ఏతాని గోవిన్దపరిరమ్భితః ॥
వ్యాఖ్య
నారదుడు ప్రహ్లాదుని గుణగణములను వర్ణించుచు ఈ విధముగా పలికెను:

పానీయంబులు ద్రావుచుం = నీరు త్రాగుచున్న వేళల్లో;
కుడుచుచున్ = భుజించుచున్న వేళల్లో;
భాషించుచున్ = మాట్లాడుచున్న వేళల్లో;
హాస లీలా = నవ్వు పుట్టించు పనులు చేయు వేళల్లో;
నిద్రాదులు సేయుచుం = నిద్రించు సమయములలో;
తిరుగుచున్ = తిరుగుచున్న సమయములలో;
లక్ష్మించుచున్ = కూర్చొని [గమనించుచున్న] సమయములలో;
సంతత = ఎల్లప్పుడు [అన్ని వేళల్లోనూ];
శ్రీనారాయణ = శ్రీమన్నారాయణుని;
పాదపద్మ యుగళీ చింతామృత = పాదముల జంటను చింతించుట లో కలిగే అమృతమును;
ఆస్వాద సంధానుండై = ఆస్వాదించుటలో మనసును ఏకాగ్రతతో యుంచి;
మఱచెన్ సురారిసుతుఁ డు= [ఆ] రాక్షస కుమారుడు [అయిన ప్రహ్లాదుడు] మఱచిపోవును;
ఏతద్విశ్వమున్ = ఈ విశ్వమునంతటిని;
భూవరా = [ఓ] రాజా [యుధిష్ఠిరా].

మూల శ్లోకముకంటే పోతనగారు "హాస లీలా" అనే కార్యమును అదనముగా జేర్చెను. అయితే ఇది జాగ్రత్తగా వాడిన పదము. ఎందుకనగా ప్రహ్లాదుడు ఆటలను ఆడుటలో ఇష్టము చూపునని ఎచ్చటను కనిపించదు. నిజమునకు దీని ముందరనున్న పద్యములో, ప్రహ్లాదుని గుణములను వర్ణించుచు, "జెలికాండ్ర నెవ్వరిఁ జేర మఱచు" అని, "బాలురతోడ నాడ మఱచు" (7.122) అని చెప్పబడినది. ఇంకనూ ప్రహ్లాదుడు తన తోటి బాలురతో "వృధాప్రయాసంబున నాయుర్వ్యయంబు సేయంజనదు" (7.213) అని చెప్పియుండెను. కనుక పోతనగారు పద్యమునందు ఛందోబద్ధత తప్పకుండుట కొఱకు "హాస లీలా" అని మాత్రమే వాడెను.
సాధన
పానీయంబులు ద్రావుచుం గుడుచుచున్ భాషించుచున్ హాస లీ
లా
నిద్రాదులు సేయుచుం దిరుగుచున్ లక్షించుచున్ సంతత
శ్రీనారాయణ
పాదపద్మ యుగళీ చింతామృతా స్వాద సం
ధానుండై
మఱచెన్ సురారిసుతుఁ డేతద్విశ్వమున్ భూవరా!
pAnIyaMbulu drAvucuM guDucucun bhAshiMcucun hAsa lI
lA
nidrAdulu sEyucuM dirugucun lakshiMcucun saMtata
SrInArAyaNa
pAdapadma yugaLI ciMtAmRtA svAda saM
dhAnuMDai
ma~racen surArisutu@M DEtadviSvamun bhUvarA!
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)