పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

αβ'cal 28   Prev  /  Next

(తరగతి క్రమము 126)
చదువనివా డజ్ఞుం డగుఁ
జదివిన సదసద్వివేక చతురత గలుగుం
జదువఁగ వలయును జనులకుఁ
జదివించెద నార్యులొద్దఁ జదువుము తండ్రీ!
ఛందస్సు (Meter): కందము
స్కంధము (Chapter): 7
సంఖ్య (Number): 130
దక్కిన సామ్రాజ్య పదవిని లక్ష్యము చేయక, బలము లేని వానివలె ఎప్పుడు మర్యాదలు చూపుతుంటాడు అని, చదివించిన గాని వీనికి "తీవ్ర" బుద్ధి రాదని [7.129] అనుకొని హిరణ్యకశిపుడు తన కుమారుడైన ప్రహ్లాదునితో ఇట్లు పలికెను.
వ్యాఖ్య
చదువనివాడు + అజ్ఞుండు + అగుఁ = చదువుకొననివానికి జ్ఞానము కలుగదు;
చదివిన సత్ + ఆసత్ + వివేక చతురత గలుగుం = చదువుకొనిన సత్యము, అసత్యముల విచక్షణ కలుగును;
చదువఁగ వలయును జనులకుఁ = [కనుక] ప్రజలందరు చదువుకొనవలయును;
చదివించెదన్ + ఆర్యుల + ఒద్దఁ = [నిన్ను] గురువుల దగ్గర చదివించెదను;
చదువుము తండ్రీ = చదువుకో నాయనా!
సాధన
చదువనివా డజ్ఞుం డగుఁ
జదివిన సదసద్వివేక చతురత గలుగుం
జదువఁగ వలయును జనులకుఁ
జదివించెద నార్యులొద్దఁ జదువుము తండ్రీ!
caduvanivA Daj~nuM Dagu@M
jadivina sadasadvivEka caturata galuguM
jaduva@Mga valayunu janulaku@M
jadiviMceda nAryulodda@M jaduvumu taMDrI!
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)