పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

గ్రంథ క్రమము 71   Prev  /  Next

(తరగతి క్రమము 50)
శ్రీకృష్ణా! యదుభూషణా! నరసఖా! శృంగారరత్నాకరా!
లోకద్రోహి నరేంద్రవంశదహనా! లోకేశ్వరా! దేవతా
నీక బ్రాహ్మణ గోగణార్తిహరణా! నిర్వాణసంధాయకా!
నీకున్ మ్రొక్కెదఁ ద్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధీ!
ఛందస్సు (Meter): శార్దూలము
స్కంధము (Chapter): 1
సంఖ్య (Number): 200
కుంతీదేవి శ్రీకృష్ణుని ఈ విధముగా ప్రార్థించెను. ఈ పద్యము ఈ క్రింది సంస్కృత శ్లోకమునకు పోతనగారు చేసిన తెలుగు అనువాదము:

श्रीकृष्ण कृष्णसख वृष्ण्यृषभावनिध्रुग् राजन्यवंशदहनानपवर्गवीर्य ।
गोविन्द गोद्विजसुरार्तिहरावतार योगेश्वराखिलगुरो भगवन्नमस्ते ॥

శ్రీకృష్ణ కృష్ణసఖ వృష్ణ్యృషభావనిధ్రుగ్ రాజన్యవంశదహనానపవర్గవీర్య ।
గోవింద గోద్విజసురార్తిహరావతార యోగేశ్వరాఖిలగురో భగవన్నమస్తే ॥
వ్యాఖ్య
శ్రీ కృష్ణా! = (ఓ) శ్రీకృష్ణా!;
యదుభూషణా! = యదుకులముంకు అలంకారమైనవాడా!;
నరసఖా! = అర్జునుని మితృడా!;
శృంగారరత్నాకరా = శృంగారములో రత్నమైన వాడా!;
లోకద్రోహి నరేంద్రవంశదహనా! = లోకమునకు ద్రోహము చేయు రాజుల వంశములను నాశనము చేయువాడా!;
లోకేశ్వరా! = (ఓ) లోకమునకు ఈశ్వరుడా!;
దేవతా నీక బ్రాహ్మణ గోగణార్తిహరణా! = దేవతల, బ్రాహ్మణుల, ఆవులమందల దుఃఖములను తొలగించువాడా!;
నిర్వాణసంధాయకా! = ముక్తికి చేరువ చేయువాడా!;
నీకున్ మ్రొక్కెదఁ = నిన్ను ప్రార్థిస్తున్నాను;
త్రుంపవే భవలతల్ = (నా యొక్క) సంసార (బంధపు) తీగెలను త్రెంపవయ్యా!;
నిత్యానుకంపానిధీ! = నిత్యము కనికరమునకు నిధియైన వాడా!

ఈ పద్యములో పోతనగారు ఉపయోగించినటువంటి గొప్ప భావము: "త్రుంపవే భవలతల్". సందర్భోచితమైన భావ వ్యక్తీకరణ ఇచ్చట జరిగినది. భగవంతుని మనము దేనిని కోరి ప్రార్థించవలేనో పోతనగారు ఈ పదములలో మనకు అవగతము చేసెను. దీనికు ముందునున్న పద్యములో కుంతీదేవి తనకు యాదవులమీద, పాండవులమీద "మోహవిచ్ఛేదము" చేయమని కోరెను. మరి ఈ పద్యమునకు మూల శ్లోకములో "యోగేశ్వరా", "అఖిల గురో" అని యున్నది. యోగేశ్వరా అనే పదమును పోతనగారు "నిర్వాణ సంధాయక" అని అన్ని యోగములకు నిర్వాణమే ధ్యేయమని మనకు వెల్లడించారు. తరువాత "గురో" అనే పదమునకు అర్థము "ఓ గురువా" అని. కాని మనము గురువును ఎందుకు చేరెదము? మన భవబంధములను త్రెంచుకొనుటకే కదా? కనుక పోతనగారు "త్రుంపవే భవలతల్" అని మనకు నూరిపోశారు. ఈ అనువాద మహిమ పోతన భాగవతము చదువుకునే వారి అదృష్టము.
సాధన
శ్రీకృష్ణా! యదుభూషణా! నరసఖా! శృంగారరత్నాకరా!
లోకద్రోహి నరేంద్రవంశదహనా! లోకేశ్వరా! దేవతా
నీక బ్రాహ్మణ గోగణార్తిహరణా!
నిర్వాణసంధాయకా!
నీకున్ మ్రొక్కెదఁ ద్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధీ!
SrIkRshNA! yadubhUshaNA! narasakhA! SRMgAraratnAkarA!
lOkadrOhi narEMdravaMSadahanA! lOkESvarA! dEvatA
nIka brAhmaNa gOgaNArtiharaNA!
nirvANasaMdhAyakA!
nIkun mrokkeda@M druMpavE bhavalatal nityAnukaMpAnidhI!
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)