పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

తరగతి క్రమము 27   Prev  /  Next

వాయించు వీణ నెప్పుడు
మ్రోయించు ముకుందగీతముల జగములకుం
జేయించుఁ జెవుల పండువు
మాయించు నఘాళి నిట్టి మతి మఱి గలఁడే.
ఛందస్సు (Meter): కందము
స్కంధము (Chapter): 1
సంఖ్య (Number): 134
ఈ పద్యము ఈ క్రింది శ్లోకమునకు పోతనగారు చేసిన అనువాదము.

अहो देवर्ष्हिर्धन्योऽयं यत्कीर्तिं शार्ङगधन्वनः।
गायन्माद्यान्निदं तन्त्र्या शमयत्यातुरं जगत्॥

అహో దేవర్షిర్ధన్యోऽయం యత్కీర్తిం శార్ఞ్గధన్వనః ।
గాయన్మాద్యాన్నిదం తంత్ర్యా రమయత్యాతురం జగత్ ॥
వ్యాఖ్య
నారదుని గురించి సూతుడు ఈ విధముగా శౌనకుడు మొదలయిన మునులతో చెప్పెను:

వాయించు వీణ నెప్పుడు = నిత్యమూ (మహతి అను తన) వీణను వాయించుతూ ఉండును;
మ్రోయించు ముకుందగీతముల = విష్ణుని కీర్తనలను నాదము చేయుచూ నుండును;
జగములకుం జేయించుఁ జెవుల పండువు = లోకమంతటికి చెవుల పండుగ చేయును;
మాయించు నఘాళి = అఘములను (దుఃఖములను) పోగొట్టును;
ఇట్టి మతి మఱి గలఁడే = ఇటువంటి మనసు గలవాడు (అనగా జ్ఞాని) ఇంకెక్కడయినా ఉన్నాడా? (లేడు అని అర్థము).

నారదుడు తన పూర్వజన్మ వృత్తాంతాన్ని వ్యాసునకు చెప్పి, భాగవతాన్ని వ్రాయమని చెప్పి మహతి అను తన వీణను వాయించుకుంటూ వెడలిపోయెను. ఈ కథను వర్ణించిన సూతుడు ఈ పద్యములో చెప్పిన రీతిగా మిగిలిన శౌనకాది మునులతో చెప్పెను. ఆత్మజ్ఞానము కలిగిన యోగులగురించి ఈ పద్యములో రెండు విషయములు చెప్పబడినవి. (1) తము భగవంతుని గానముచేయుచు ఆత్మయందు ఆనందమును పొందుదురు, (2) వారుచేసే పనులు లోక కల్యాణముకొఱకైయుండును.

ఆత్మజ్ఞానముతో ఆనందించు రాజర్షులలో నారదుడే తన స్వరూపమని సాక్షాత్తూ ఆ పరమాత్మయే భగవద్గీతలోని పదవ అధ్యాములో 27వ శ్లోకములో చెప్పెను (దేవర్షీణాం చ నారదః).

అత్యంత ప్రసిద్ధమయిన "ఎందరో మహానుభావులు" అను త్యాగరాజ కీర్తన ఇటువంటి మహానుభావుల గురించియే చెప్పును. ఈ కీర్తనలోని అనుపల్లవి: "చందురి వర్ణుని యందచందమును హృదయారవిందమునఁ జూచి బ్రహ్మానందమనుభవించు వారెందరో". తరువాత 6వ చరణము లో "హొయలు మీర నడు గల్గు సరసుని సదా కనులఁ జూచుచును పులక శరీరులై యానందపయోధి నిమగ్నులై ముదంబునను యశము గలవారెందరో".
సాధన
వాయించు వీణ నెప్పుడు
మ్రోయించు ముకుందగీతముల జగములకుం
జేయించుఁ జెవుల పండువు
మాయించు నఘాళి నిట్టి మతి మఱి గలఁడే.
vAyiMcu vINa neppuDu
mrOyiMcu mukuMdagItamula jagamulakuM
jEyiMcu@M jevula paMDuvu
mAyiMcu naghALi niTTi mati ma~ri gala@MDE.
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)