పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

αβ'cal 42   Prev  /  Next

(తరగతి క్రమము 18)
ఏల కుమార! శోషిలగ? నీ జననంబున నన్నుఁ గానఁగా
జాలవు నీవు కామముఖషట్కము నిర్దళితంబు సేసి ని
ర్మూలితకర్ములైన మునిముఖ్యులుగాని కుయోగి గానఁగాఁ
జాలఁడు; నీదు కోర్కి కొనసాగుటకై నిజమూర్తిఁ జూపితిన్.
ఛందస్సు (Meter): ఉత్పలమాల
స్కంధము (Chapter): 1
సంఖ్య (Number): 125
ఈ పద్యము ఈ క్రింది రెండు శ్లోకములకు పోతనగారి అనువాదము:

हन्तास्मिञ्जन्मनि भवान्मा मां द्रष्टुमिहार्हति ।
अविपक्वकषायाणां दुर्दर्शोऽहं कुयोगिनाम् ॥
सकृद् यद् दर्शितं रुपमेतत्कामाय तेऽनघ ।
मत्कामः शनकैः साधु सर्वान्मुञ्चति हृच्छयान् ॥

హంతాస్మిఙ్జన్మని భవాన్మా మాం ద్రష్టుమిహార్హతి ।
అవిపక్వకషాయాణాం దుర్దర్శోऽహం కుయోగినాం ॥
సకృద్యద్ దర్శితం రూపమేతత్కామాయ తేऽనఘ ।
మత్కామః శనకైః సాధు సర్వాన్ముఙ్చతి హృచ్ఛయాన్ ॥
వ్యాఖ్య
ఏల కుమారా? = ఓ కుమారా ఎందుకు?;
శోషిలగ = (అన్న పానములు లేక ఇలా) అలసి పోవుట;
నీ జననంబున = (ఈ) నీ జన్మమున;
నన్నుఁ గానఁగా జాలవు నీవు = నన్ను చూడలేవు నీవు;
కామముఖషట్కము = కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు అను ఆరు (శత్రు) సమూహమును;
నిర్దళితంబు సేసి = పూర్తిగా ఖండించి;
నిర్మూలితకర్ములైన = కర్మలనన్నింటిని నిర్మూలనము గావించిన;
మునిముఖ్యులుగాని = శ్రేష్ఠమైన మునులు మాత్రమే (చూడగలరు), కాని;
కుయోగి కానగా జాలడు = యోగమున అధముడైనవాడు (అనగా యోగమునందు పరిపక్వత లేని వాడు) చూడలేడు;
నీదు కోర్కి కొనసాగుటకై = నీ (మనస్సున నన్ను చూడవలెనన్న) కోరిక ను కొనసాగించుటకు గాను;
నిజమూర్తిఁ జూపితిన్ = నా రూపమును (తాత్కాలికముగా నీకు) చూపితిని.

వేదములను నాలుగుగా విభజించి, వేదసారముగా మహాభారతమును రచించిన వ్యాసమహర్షి, హరి నామము ప్రధానముగా పూర్తి భక్తి కావ్యము వ్రాయనందులకు వ్యాకుల చిత్తుడై యుండగా, నారదుడు తన మహతి అను వీణతో తన చెంతకు వచ్చి, అటువంటి గ్రంధము వ్రాయమని సలహా ఇచ్చెను. పిమ్మట నారదుని పూర్వ జన్మ వృత్తాంతమును చెప్పమని వ్యాస మహర్షి కోరెను. తను పూర్వ కల్పములో వేదవేత్తల వారిండ్లలో పనిచేసే ఒక దాసీ పుత్రుడనని, వారికి పరిచర్యలు గావించగా వారు తనను అనుగ్రహించి వాసుదేవుని మాయను తెలిపెనని, కర్మలను భగవదార్పితముచేసినచో కర్మ బంధములను తొలగించుకొనవచ్చని వారు చెప్పెను. అటు పిమ్మట తన తల్లి మరణించగా, ఇక తనకు హరినామమే శరణ్యమని తలచి తను అడవులకేగి ఎంతో అలసిపోయి ఒక రావి చెట్టు క్రింద సేదతీర్చుకొని, ధ్యానము చేయుచుండగా, భగవంతుడు తన మనసులో ప్రత్యక్షమయ్యెను. కనులు తెరచి చూడగా మాయమయ్యెను. ఆ అడవిలో ఎంత వెదకి వేసారినా, మరల ఆ రూపము కనిపించలేదు. అప్పుడు ఈ పై పద్యములో చెప్పిన విధముగా, తనను ఓదార్చుచున్నట్లుగా ఈ వచనములు వినవచ్చెను.
సాధన
ఏల కుమార! శోషిలగ? నీ జననంబున నన్నుఁ గానఁగా
జాలవు నీవు
కామముఖషట్కము నిర్దళితంబు సేసి ని
ర్మూలితకర్ములైన
మునిముఖ్యులుగాని కుయోగి గానఁగాఁ
జాలఁడు;
నీదు కోర్కి కొనసాగుటకై నిజమూర్తిఁ జూపితిన్.
Ela kumAra! SOshilaga? nI jananaMbuna nannu@M gAna@MgA
jAlavu nIvu
kAmamukhashaTkamu nirdaLitaMbu sEsi ni
rmUlitakarmulaina
munimukhyulugAni kuyOgi gAna@MgA@M
jAla@MDu;
nIdu kOrki konasAguTakai nijamUrti@M jUpitin.
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)