పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

αβ'cal 46   Prev  /  Next

(తరగతి క్రమము 20)
ఎఱిఁగెడు వాఁడు కర్మచయమెల్లను మాని హరి స్వరూపమున్
నెఱయ నెఱింగి యవ్వలన నేరుపుఁ జూపు గుణానురక్తుఁడై
తెఱకువ లేక క్రుమ్మరుచు దేహధనాద్యభిమాన యుక్తుఁడై
యెఱుఁగని వానికిం దెలియ నీశ్వరలీల లెఱుంగఁ జెప్పవే.
ఛందస్సు (Meter): చంపకమాల
స్కంధము (Chapter): 1
సంఖ్య (Number): 99
ఈ పద్యము ఈ క్రింది శ్లోకమునకు పోతనగారు చేసిన తెలుగు అనువాదము.

विचक्षणोऽस्यार्हति वेदितुं विभो रनन्तपारस्य निव्रुत्तितः सुखं ।
प्रवर्तमानस्य गुणैरनात्मन स्ततो भवान्दर्शय चेष्टितं विभोः ॥

విచక్షణోऽస్యార్హతి వేదితుం విభో రనంతపారస్య నివ్రుత్తితః సుఖం।
ప్రవర్తమానస్య గుణైరనాత్మన స్తతో భవాందర్శయ చేష్టితం విభోః॥
వ్యాఖ్య
ఎఱిఁగెడు వాఁడు = (కర్మ ఫలమును సూచించు వేద మార్గము ల ఆంతర్యము - బ్రహ్మ జ్ఞానముల విచక్షణ) తెలిసినవాడు;
కర్మచయమెల్లను మాని = కర్మముల సమూహములనన్నింటిని విరమించుకొని;
హరి స్వరూపమున్ నెఱయ నెఱింగి = భగవంతుని స్వరూపమును పూర్తిగ తెలిసికొని;
అవ్వలన నేరుపుఁ జూపు = ఆపై నేర్పరితనముతో;
గుణానురక్తుఁడై = (భగవంతుని) గుణగణములయందు ఆసక్తిగలవాడై (యుండును.);
తెఱకువ లేక క్రుమ్మరుచు = వివేకము లేక తిరుగుచు;
దేహధనాద్యభిమాన యుక్తుఁడై = శరీరము, ధనము మొదలైన వానియందు ప్రేమగలవాడై;
యెఱుఁగని వానికిం దెలియ = (విచక్షణా జ్ఞానము) తెలియని వానికి కూడా తెలియునట్లు;
ఈశ్వరలీల లెఱుంగఁ జెప్పవే = ఈశ్వర లీలలను చెప్పుము;

ఈ పద్యములోని మాటలను నారదుడు వ్యాసభగవానుని తో పలికెను. వ్యాసుడు వేదములను నాలుగుగా విభజించెను. వేదములలోని సారమును మహాభారత గ్రంధములో ఇమిడ్చెను. ఇతిహాసాలను, పురాణాలను రచించెను. కఠోరమైన వ్రతాలనెన్నో చేపట్టెను. అయినప్పటికిని భగవంతుని స్వరూపమును చెప్పుట మరచి పోయి పొరపాటు చేసితినని బాధపడుచుండగా, నారదుడు వ్యాసుని దగ్గరకు తన మహతి అను వీణను వాయించుతూ వచ్చెను. ఇన్ని గ్రంధములను వ్రాసినా, ఏ గ్రంధములోను నీవు హరినామ సంకీర్తనమే ప్రధానముగా చేయలేకపోవుట పొరపాటని చెప్పెను. జ్ఞానము, వాక్కు, కర్మలు ఎంత గొప్పవైనా, భక్తిలేనియెడల అవి నిరర్ధకములని చెప్పెను. జుగుప్సితంబులైన కామ్యకర్మలను చేయుచు, తత్వజ్ఞానమును మఱచి పోవు ప్రాకృత జనులకు నియమించిన ధర్మబోధలు చేసితివి, అది నీకు తగదు, ఎందుకనగా వారు అదియే ధర్మమని తలతురు - అని నారదుడు చెప్పి ఇంకా ఈ పద్యములోని మాటలను చెప్పెను.
సాధన
ఎఱిఁగెడు వాఁడు కర్మచయమెల్లను మాని హరి స్వరూపమున్
నెఱయ నెఱింగి
యవ్వలన నేరుపుఁ జూపు గుణానురక్తుఁడై
తెఱకువ లేక క్రుమ్మరుచు దేహధనాద్యభిమాన యుక్తుఁడై
యెఱుఁగని వానికిం దెలియ
నీశ్వరలీల లెఱుంగఁ జెప్పవే.
e~ri@MgeDu vA@MDu karmacayamellanu mAni hari svarUpamun
ne~raya ne~riMgi
yavvalana nErupu@M jUpu guNA nuraktu@MDai
te~rakuva lEka krummarucu dEhadhanAdyabhimAna yuktu@MDai
ye~ru@Mgani vAnikiM deliya
nISvaralIla le~ruMga@M jeppavE
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)