పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

αβ'cal 119   Prev  /  Next

(తరగతి క్రమము 29)
పలికెడిది భాగవతమఁట!
పలికించెడి వాడు రామభద్రుండఁట! నేఁ
బలికిన భవహర మగునఁట!
పలికెద వేఱొండుగాథఁ బలుకఁగ నేలా?
ఛందస్సు (Meter): కందము
స్కంధము (Chapter): 1
సంఖ్య (Number): 18
పోతన గారు భాగవత కథ అనువాదమునకు ముందు కొన్ని పద్యములను వ్రాసెను. అందులో తన వినయము, భక్తి భావము మనకు అగుపించును. తనకు భాగవతమును అనువదించు అవకాశమును గురించి ఈ విధముగా చెప్పెను.
వ్యాఖ్య
పలికెడిది భాగవతమట! = [నేను] పలుగుచున్నది [అనువాదము చేయుచున్నది] భాగవతము;
పలికెంచెడి వాడు రామభద్రుండట! = [నాచేత] అనువాదము గావించుచున్నది శ్రీరాముడు;
నేఁ బలికిన భవహరమగునట! = నా అనువాదమువలన [నా] సంసార [దుఃఖములు] నశించును;
పలికెద = [కనుక నేను ఈ భాగవత కథను] అనువదించెదను;
వేఱొండుగాథఁ బలుకఁగ నేలా? = వేఱొక కథను పలుకుట ఎందులకు?

ఈ పద్యములో పోతనగారు "అట" అను పదమును ఉపయోగించి తన వినయమును, భాగవతకథ యొక్క గొప్పతనమును, దానిని అనువదించు భాగ్యము తనకు కలిగినందులకు ఆశ్చర్యమును వ్యక్తపరచుచున్నారు. "అట" అను పదమును తొలగించి ఈ పద్యమును చదువుకొనిన పూర్తిగా విరుద్ధమయిన భావము కలుగును. ఉదాహరణకు "పలికెడిది భాగవతమట" అను పాదమునకు బదులుగా "పలికెడిది భాగవతకథ" అని వ్రాసియున్నయెడల అదియును ఛందస్సులో చక్కగా నప్పును. కాని అది గర్వపడుతూ పలికినటువంటి మాటయగును. అదేవిధముగా "పలికించెడివాడు రామభద్రుండట! నేఁ" అనే పాదమునకు బదులుగా "పలికించెదివాడు రామభద్రుండయె! నేఁ" అనిగాని ఇంకేయితరముగా గాని పూరించినయెడల అది భగవంతుడు తనమీద మాత్రమే అనుగ్రహమును చూపెను అను భావము వచ్చును. ఇటువంటి పదప్రయోగములు కాకుండ, జీవిత మర్మము తెలిసిన పోతనగారు "అట" అను పదమును ఉపయోగించి తన వైరాగ్యబుద్ధిని కూడా ప్రకటించెను.
సాధన
పలికెడిది భాగవతమఁట!
పలికించెడి వాడు రామభద్రుండఁట! నేఁ
బలికిన భవహర మగునఁట!
పలికెద వేఱొండుగాథఁ బలుకఁగ నేలా?
palikeDidi bhAgavatamaTa!
palikeMceDi vADu rAmabhadruMDaTa! nE@M
balikina bhavaharamagunaTa!
palikeda vE~roMDugAtha@M baluka@Mga nElA?
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)