పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

αβ'cal 145   Prev  /  Next

(తరగతి క్రమము 107)
శ్రీవల్లభుఁడు దన్నుఁ జేరిన యట్లైనఁ జెలికాండ్ర నెవ్వరిఁ జేర మఱచు
నసురారి దనమ్రోల నాడినయట్లైన నసుర బాలురతోడ నాడ మఱచు
భక్తవత్సలుఁడు సంభాషించి నట్లైనఁ బరభాషలకు మాఱుపలుక మఱచు
సురవంద్యుఁ దనలోనఁ జూచిన యట్లైనఁ జొక్కి సమస్తంబుఁ జూడ మఱచు

హరిపదాంభోజయుగ జింతనామృతమున
నంతరంగంబు నిండినట్లైన నతఁడు
నిత్య పరిపూర్ణుఁ డగుచు నన్నియును మఱచి
జడత లేకయు నుండును జడుని భంగి.
ఛందస్సు (Meter): సీసము, తేటగీతి
స్కంధము (Chapter): 7
సంఖ్య (Number): 122
నారదుడు యుధిష్ఠురినికి ప్రహ్లాదుని గుణగణములను వర్ణించుచుండెను. ఈ పద్యము ఈ క్రింది సంస్కృత శ్లోకమునకు పోతనగారు చేసిన తెలుగు అనువాదము:

न्यस्तक्रीडनको बालो जडवत्तन्मनस्तया।
कृष्णग्रहगृहीतात्मा न वेद जगदीदृशम् ॥

న్యస్తకీడనకో బాలో జడవత్తన్మనస్తయా ।
కృష్ణగ్రహగృహీతాత్మా న వేద జహదీదృశం ॥
వ్యాఖ్య
నారదుడు ప్రహ్లాదుని గుణగణములను వర్ణించుచు ఇట్లనెను:

శ్రీవల్లభుఁడు = లక్ష్మీదేవి పతి / సంపదకు అధిపతి / భగవంతుడు;
తన్నుఁ జేరిన యట్లైనఁ = తన చెంతకు చేరినట్లు భావించి;
చెలికాండ్ర నెవ్వరిఁ జేర మఱచు = తన స్నేహితుల చెంతకు చేరుట మఱచును;
అసురారి దనమ్రోల నాడినయట్లైన = రాక్షసుల శత్రువు / భగవంతుడు తన ముందర ఆడుకుంటున్నట్లు భావించి;
అసుర బాలురతోడ నాడ మఱచు = రాక్షస బాలురతో ఆటలాడుట మఱచును;
భక్తవత్సలుఁడు = భక్తులయందు వాత్సల్యము గలవాడు / భగవంతుడు;
సంభాషించి నట్లైనఁ = తనతో మాట్లాడుచున్నట్లుగా భావించి;
పరభాషలకు మాఱుపలుక మఱచు = ఇతరుల పిలుపులకు పలుకుట మఱచును;
సురవంద్యుఁ = దేవతలచే పూజింపబడువాడు / భగవంతుడు;
తనలోనఁ జూచిన యట్లైనఁ = తనలో చూచుచున్నట్లు భావించి;
చొక్కి = ఆనందముతో;
సమస్తంబుఁ జూడ మఱచు = [తన చుట్టూ ఉన్న] ప్రపంచాన్ని చూచుట మఱచును;
హరిపదాంభోజయుగ జింతనామృతమున = హరి పాదపద్మముల చింతనతో కలిగిన అమృతము తో;
అంతరంగంబు నిండినట్లైన = తన అంతరంగము నిండిపోయినట్లు భావించి;
అతఁడు నిత్య పరిపూర్ణుఁ డగుచు = అతడు [ప్రహ్లాదుడు] నిత్యమూ ఆనందముతో నిండినవాడై [ఎట్టి వెలితి లేని వాడై];
అన్నియును మఱచి = అన్నింటిని [అన్ని విషయచింతనములను] మఱచి / విడనాడి;
జడత లేకయు = ఎటువంటి జడత్వము [సోమరితనము] లేకుండినను;
ఉండును జడుని భంగి = జడునివలె [సోమరివలె] కనిపించును;
సాధన
శ్రీవల్లభుఁడు దన్నుఁ జేరిన యట్లైనఁ జెలికాండ్ర నెవ్వరిఁ జేర మఱచు
నసురారి దనమ్రోల నాడినయట్లైన నసుర బాలురతోడ నాడ మఱచు
భక్తవత్సలుఁడు సంభాషించి నట్లైనఁ బరభాషలకు మాఱుపలుక మఱచు
సురవంద్యుఁ దనలోనఁ జూచిన యట్లైనఁ జొక్కి సమస్తంబుఁ జూడ మఱచు

హరిపదాంభోజయుగ జింతనామృతమున
నంతరంగంబు నిండినట్లైన నతఁడు
నిత్య పరిపూర్ణుఁ డగుచు
నన్నియును మఱచి
జడత లేకయు నుండును జడుని భంగి.
SrIvallabhu@MDu dannu@M jErina yaTlaina@M jelikAMDra nevvari@M jEra ma~racu
nasurAri danamrOla nADinayaTlaina nasura bAluratODa nADa ma~racu
bhaktavatsalu@MDu saMbhAshiMci naTlaina@M barabhAshalaku mA~rupaluka ma~racu
suravaMdyu@M danalOna@M jUcina yaTlaina@M jokki samastaMbu@M jUDa ma~racu

haripadAMbhOjayuga jiMtanAmRtamuna
naMtaraMgaMbu niMDinaTlaina nata@MDu
nitya paripUrNu@M Dagucu
nanniyunu ma~raci
jaData lEkayu nuMDunu jaDuni bhaMgi.
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)