పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

అక్షర క్రమము 18   Prev  /  Next

(తరగతి క్రమము 115)
ఆత్మ నిత్యుండు, క్షయ రహితుండు, శుద్ధుండు, క్షేత్రజ్ఞుండు,
గగనాదులకు నాశ్రయుండు, గ్రియాశూన్యుండు, స్వప్రకాశుండు, సృష్టి హేతువు,
వ్యాపకుండు, నిస్సంగుండుఁ, బరిపూర్ణుండు, నొక్కండునని వివేక సమర్థంబులగు
నాత్మలక్షణంబులు పండ్రెండు.
ఛందస్సు (Meter): వచనము
స్కంధము (Chapter): 7
సంఖ్య (Number): 237
తను తన తల్లి గర్భమునందున్న సమయమున నారదుడు వచించినట్లుగా ప్రహ్లాదుడు ఇట్లు పలికెను. ఈ వచనము ఈ క్రింది సంస్కృత శ్లోకములలోని మొదటి శ్లోకమునకు, రెండవ శ్లోకమునందలి మొదటి పాదమునకు పోతనగారు చేసిన తెలుగు అనువాదము.

आत्मा नित्योऽव्ययः शुद्ध एकः क्षेत्रज्ञ आश्रयः ।
अविक्रियः स्वदृग् हेतुर्व्यापकोऽसङ्ग्यनावृतः ॥
एतैर्द्वादशभिर्विद्वानात्मनो लक्षणैः परैः ।
अहं ममेत्यसद्भावं देहादौ मोहजं त्यजेत् ॥

ఆత్మా నిత్యోऽవ్యయః శుద్ధ ఏకః క్షేత్రజ్ఞ ఆశ్రయః ।
అవిక్రియః స్వదృగ్ హేతుర్వ్యాపకోऽసఙ్గ్యనావృతః ॥
ఏతైర్ద్వాదశభిర్విద్వానాత్మనో లక్షణైః పరైః ।
అహం మమేత్యసద్భావం దేహాదౌ మోహజం త్యజేత్ ॥
వ్యాఖ్య
ఆత్మకు పన్నెండు లక్షణములు గలవని నారదుడు చెప్పుచుండెను:

ఆత్మ నిత్యుండు = ఆత్మ శాశ్వతమైనది (మరణము లేనిది);
క్షయ రహితుండు = నాశనము లేనిది;
శుద్ధుండు = [భౌతిక విషయములచే] మలినము లేనిది;
క్షేత్రజ్ఞుండు = శరీరమును ఎరిగినది (కనుక శరీరకు కంటె భిన్నమైనది);
గగనాదులకు నాశ్రయుండు = ఆకాశము మొదలైన వానికి ఆధారమైనది;
క్రియాశూన్యుండు = క్రియలు (లేదా మార్పులు) లేనిది;
స్వప్రకాశుండు = స్వయముగా ప్రకాశించునది;
సృష్టి హేతువు = సృష్టి కి (మూలమునకే) కారణభూతమైనది;
వ్యాపకుండు = (శరీరమంతటా) వ్యాపించినది;
నిస్సంగుండుఁ = [శరీరమంతటా వ్యాపించిననూ, ఈ శరీరముతో] బంధము లేనిది;
పరిపూర్ణుండు = పరిపూర్ణమైనది [సంస్కృతమున "అనావృతము" అను పదమునకు పోతనగారి అనువాదము];
ఒక్కండు = ఒకటిగా ఉండునది;
అని వివేక సమర్థంబులగు = ఈ విధముగా జ్ఞానముతో తెలిసికొనబడగల;
ఆత్మలక్షణంబులు పండ్రెండు = ఆత్మ లక్షణములు పన్నెండు (12).
సాధన
ఆత్మ నిత్యుండు, క్షయ రహితుండు, శుద్ధుండు, క్షేత్రజ్ఞుండు,
గగనాదులకు నాశ్రయుండు, గ్రియాశూన్యుండు, స్వప్రకాశుండు, సృష్టి హేతువు,
వ్యాపకుండు, నిస్సంగుండుఁ, బరిపూర్ణుండు, నొక్కండు నని వివేక సమర్థంబులగు
నాత్మలక్షణంబులు పండ్రెండు.
Atma nityuMDu, kshaya rahituMDu, SuddhuMDu, kshEtraj~nuMDu,
gaganAdulaku nASrayuMDu, griyASUnyuMDu, svaprakASuMDu, sRshTi hEtuvu,
vyApakuMDu, nissaMguMDu@M, baripUrNuMDu, nokkaMDu nani vivEka samarthaMbulagu
nAtmalakshaNaMbulu paMDreMDu.
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)