పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

అక్షర క్రమము 14   Prev  /  Next

(తరగతి క్రమము 95)
అలుకనైనఁ జెలిమినైనఁ గామంబున
నైన బాంధవమున నైన భీతి
నైనఁ దగిలి తలఁప నఖిలాత్ముఁ డగు హరిఁ
జేరవచ్చు వేఱు సేయఁ డతఁడు.
ఛందస్సు (Meter): ఆటవెలది
స్కంధము (Chapter): 7
సంఖ్య (Number): 14
శిశుపాలకులవంటి శత్రువులు కూడా భగవంతుని చేరుట యేమి అని యుధిష్టురుడు అడుగగా నారదుడు భగవంతుని తత్వమును వివరించి ఇట్లు పలికెను. ఈ పద్యము ఈ క్రింది సంస్కృత శ్లోకమునకు పోతనగారు చేసిన తెలుగు అనువాదము:
तस्माद्वैरानुबन्धेन निर्वैरिण भयेन वा ।
स्नेहात्कामेन वा युञ्ज्यात् कथञ्चिन्नेक्षते पृथक् ॥
తస్మాద్వైరానుబంధేన నిర్వైరేణ భయేన వా ।
స్నేహాత్కామేన వా యుఞ్జ్యాత్ కథఞ్చిన్నేక్షతే పృథక్ ॥
వ్యాఖ్య
సప్తమ స్కంధము పరీక్షిత్తుని ప్రశ్నతో మొదలయ్యెను. "సర్వభూతములకు సముడు" [7.3] అయినటువంటి భగవంతుడు రాక్షసులను చంపుట యేమిటి, దేవతలచే తనకు కలిగెడి లాభము యేమిటి, ఇది చోద్యముగానున్నది - అని పరీక్షిత్తు అడుగగా, శుకుడు ఇట్లు పలికెను: సర్వసముడయిన భగవంతుడు "తన మాయచేత విశ్వంబు సృజియింపంగోరి, రజంబును గ్రీడింపంగోరి, సత్త్వంబును నిద్రింపం గోరి, తమంబును నుత్పాదించి, చరమైన కాలంబును సృజియించును" [7.7] అని, ఆ కాలంబున "ఈశ్వరుండును గాలాహ్యయుండునునై హరి సత్త్వగుణంబయిన దేవానీకంబునకు వృద్ధియు రజస్తమోగుణంబులయిన రాక్షసులకు హానియుం జేయుచుండు" [7.7] అని పలికి, ఒక కథను గుర్తు చేసెను.

రాజసూయయాగము చేయుచున్న ధర్మరాజు - "బాలుడైన శిశుపాలుండు హరిని నిందించి" కూడా "తేజోరూపంబున వచ్చి హరిదేహంబున సొచ్చినం జూచి వెఱఁగుపడి" [7.9] "సభలోనున్న నారదుని" [7.9] జూచి పూర్వము వేనుడు విష్ణువును నిందింపగా బ్రాహ్మణుల శాపమునకు భగ్నుడయెను కదా [7.11], మరి ఈ శిశుపాలునికి "మాధవున్ విన సహింపడు భక్తి సహింపదు" [7.11] అట్టివాడు పరమేశ్వురుని చేరుట యేమిటి, అట్లే దంతవక్తృండును, ఈ శిశుపాలుడును "నిరతంబు గోవిందు నింద సేయుదురు" [7.13], "వీనికి విష్ణు సౌయుజ్యంబు కలుగుట కేమి హేతువు వినిపింపుము" [7.13] అని ఆడిగెను.

దీనికి నారదుడు "దూషణ భూషణ తిరస్కారంబులు శరీరంబునకు గాని పరమాత్మకు లేవు" అనియు, "శరీరాభిమానంబు" వలన నేను, నాది అనే భేదభావము ఈ శరీరమునందు కలుగుననియు, అభిమానము లేకున్న వధించినను వధంబు గాదని, కర్తృత్వ భావము (ఈ పనికి కారణము నేను అనే భావము) లేని వానికి హింస అంటదనియు, "సర్వభూతాత్మకుండైన యీశ్వరునికి" భేదభావము లేదని చెప్పి [7.13] ఈ పద్యములో చెప్పిన విధముగా చెప్పెను.
సాధన
అలుకనైనఁ జెలిమినైనఁ గామంబున
నైన
బాంధవమున నైన భీతి
నైనఁ
దగిలి తలఁప నఖిలాత్ముఁ డగు హరిఁ
జేరవచ్చు
వేఱు సేయఁ డతఁడు.
alukanaina@M jeliminaina@M gAmaMbuna
naina
bAMdhavamuna naina bhIti
naina@M
dagili tala@Mpa nakhilAtmu@M Dagu hari@M
jEravaccu
vE~ru sEya@M Data@MDu.
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)