పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

గ్రంథ క్రమము 59   Prev  /  Next

(తరగతి క్రమము 28)
జీవుండు మాయచేత మోహితుండయి గుణవ్యతిరిక్తుండయ్యు
మాయాసంగతిం దాను ద్రిగుణాత్మకుండని యభిమానించుచు
ద్రిగుణత్వాభిమానంబునం గర్తయు భోక్తయు నను ననర్థంబు నొందు[ననియు];
నయ్యనర్థంబునకు నారాయణభక్తి యోగంబు
గాని యుపశమనంబు వేఱొకటిలేదు [దనియు నిశ్చయించి];
ఛందస్సు (Meter): వచనము
స్కంధము (Chapter): 1
సంఖ్య (Number): 135
ఈ గద్యభాగము ఈ క్రింది రెండు శ్లోకములకు పోతనగారు చేసిన అనువాదము:

यया सम्मोहितो जीव आत्मानं त्रिगुणात्मकम्।
परोपि मनुतेऽनर्थं तत्कृतं चाभिपद्यते॥
अनर्थोपशमं साक्षाद्भक्तियोगमधोक्षजे।
लोकस्याजानतो विद्वांश्चक्रे सात्वतसंहिताम्॥

యయా సమ్మోహితో జీవ ఆత్మానం త్రిగుణాత్మకం।
పరోపి మనుతేనర్థం తత్కృతం చాభిపద్యతే॥
అనర్థోపశమం సాక్షాద్భక్తియోగమధోక్షజే।
లోకస్యాజానతో విద్వాంశ్చక్రే సాత్వతసంహితాం॥
వ్యాఖ్య
నారదుడు తనకు చెప్పిన మాటలను విన్న అనంతరము వ్యాసభగవానుడు ఈ విధముగా ఆలోచించెను:

జీవుండు మాయచేత మోహితుండయి = జీవుడు మాయ వలన మోహములో పడిపోయి;
గుణవ్యతిరిక్తుండయ్యు = త్రిగుణములకు అతీతుడైనప్పటికిని;
మాయాసంగతిం దాను ద్రిగుణాత్మకుండని యభిమానించుచు = మాయా ప్రభావమువలన తను త్రిగుణాత్మకుడు అని అభిమానము చూపుతూ;
త్రిగుణత్వాభిమానంబునం గర్తయు భోక్తయు నను ననర్థంబు నొందు[ననియు] = ఆ అభిమానముతో చేసేవాడు, అనుభవించేవాడు తనే అని నమ్మి అనర్థమును పొందును;
అయ్యనర్థంబునకు = అట్టి అనర్థమునకు;
నారాయణభక్తి యోగంబు గాని యుపశమనంబు వేఱొకటిలేదు [దనియు నిశ్చయించి] = భగవంతుని భక్తి కి భిన్నమైన వేరొక ఉపశమనము లేదు.

ఈ గద్యము భగవద్గీత లోని పదునాల్గవ అధ్యాయము (గుణత్రయ విభాగయోగము) లోని అన్ని శ్లోకముల అర్థమును క్లుప్తముగా సంగ్రహించియున్నది. జీవుడు సత్వ రజో తమో గుణములకు అతీతుడు (ఈ గద్యములోని "వ్యతిరిక్తుడు"), కాని వానిచే బంధింపబడియున్నాడు (భగవద్గీత 14.5). [ఈ గుణముల యొక్క వర్ణన భగవద్గీతలోని 14.6-14.18 వరకు గల శ్లోకములలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పెను.] దీనివలన (ఈ అనర్థము వలన) కర్త, భోక్త తనే అను భావము కలిగియుండును. కాని "నాన్యం గుణేభ్యః కర్తారం" (భగవద్గీత 14.19) ఈ గుణములుతప్ప వేరయిన కర్త ఏదియు లేదు. ఈ మూడు గుణములే దేహోత్పత్తికి కారణములు (భగవద్గీత 14.20). త్రిగుణములకు అతీతుడైన వాని లక్షణములేమియని అర్జునుడు అడుగగా (14.21), శ్రీకృష్ణ భగవానుడు 14.22-14.25 వరకు గల శ్లోకములలో వర్ణించును. ఈ త్రిగుణములను అధిగమించు ఉపాయమేమియని అనిన అర్జుని (14.21 లోని) ప్రశ్నకు, శ్రీకృష్ణ భగవానుడు చివరి రెండు శ్లోకములలో (14.26, 14,27) సమాధానము చెప్పును: ఎవరైతే అనన్య భక్తి యోగము ద్వారా తనను సేవించునో ("అవ్యభిచారేణ భక్తియోగేన సేవతే") వారు త్రిగుణములను అధిగమించును. ఈ భావమే భాగవతములోని ఈ గద్యములో గలదు.
సాధన
జీవుండు మాయచేత మోహితుండయి గుణవ్యతిరిక్తుండయ్యు
మాయాసంగతిం దాను ద్రిగుణాత్మకుండని యభిమానించుచు
ద్రిగుణత్వాభిమానంబునం గర్తయు భోక్తయు నను ననర్థంబు నొందు[ననియు];
నయ్యనర్థంబునకు నారాయణభక్తి యోగంబు
గాని యుపశమనంబు వేఱొకటిలేదు [దనియు నిశ్చయించి];
jIvuMDu mAyacEta mOhituMDayi guNavyatiriktuMDayyu
mAyAsaMgatiM dAnu driguNAtmakuMDani yabhimAniMcucu
driguNatvAbhimAnaMbunaM gartayu bhOktayu nanu nanarthaMbu noMdu[naniyu];
nayyanarthaMbunaku nArAyaNabhakti yOgaMbu
gAni yupaSamanaMbu vE~rokaTilEdu [daniyu niScayiMci];
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)