పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

αβ'cal 98   Prev  /  Next

(తరగతి క్రమము 35)
మఱచి యజ్ఞాన కామ్యకర్మములఁ దిరుగు
వేదనాతురులకు దన్నివృత్తిఁ జేయ
శ్రవణ చింతన వందనార్చనము లిచ్చు
కొఱకు నుదయించి తండ్రు నిన్ గొంద ఱభవ!
ఛందస్సు (Meter): తేటగీతి
స్కంధము (Chapter): 1
సంఖ్య (Number): 196
కుంతీ దేవి శ్రీ కృష్ణుని ఈ విధముగా స్తుతించెను. ఈ పద్యము పోతనగారు ఈ క్రింది శ్లోకమునకు చేసిన అనువాదము:

भवेऽश्मिन् क्लिश्य मानानामविद्याकामकर्मभिः।
श्रवणस्मरणार्हाणि करिष्यन्निति केचन ॥

భవేऽశ్మిన్ క్లిశ్య మానానామవిద్యాకామకర్మభిః ।
శ్రవణస్మరణార్హాణి కరిష్యన్నితి కేచన ॥
వ్యాఖ్య
మఱచి + అజ్ఞాన కామ్యకర్మములఁ దిరుగు = అజ్ఞానముతో (తను నిజముగా చేయవలసిన కర్తవ్యమును) మఱచి, కోరికలతో కూడిన కర్మలు చేయుచు;
వేదన + ఆతురులకు = బాధతో (నివసించు) వ్యాధిగ్రస్తులకు;
తన్నివృత్తిఁ జేయ = వారి (బాధలను) నివారించుటకు;
శ్రవణ చింతన వందనార్చనము లిచ్చు కొఱకున్ = శ్రవణము, చింతనము, వందనము, అర్చనములు సమర్పించు కొనుటకు;
ఉదయించి తండ్రు నిన్ = జన్మించిన తండ్రివి నీవు అని;
కొందఱు + అభవ! = ఓ [అభవా] సంసారబంధములను తొలగించువాడా, కొందఱు ఈ విధముగా తలచెదరు.

లక్కయింటిలో పెట్టించిన మంటలలో కాలిపోకుండా తన కుమారులైన పాండవులను, దుర్యోధనుడు పెట్టించిన విషాన్నము నుండి భీముని, దుశ్శాసనుడు చేసిన పరాభవమునుండి తన కోడలైన ద్రౌపదిని, గొప్ప పరాక్రమము కలిగిన భీష్ముడు, ద్రోణుడు, కర్ణుల పోరాటమునుండి తన కుమారులను, తరువాత - తన వంశము అంతరించకుండా ఉండేందుకు గాను - అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రమునుండి ఉత్తర గర్భములోనున్న పరీక్షిత్తును కాపాడావు - అని కుంతీదేవి శ్రీ కృష్ణుని కొనియాడెను.

శ్రీ కృష్ణుడు భక్తులను రక్షించేవాడని, ధర్మార్థకామములను నివృత్తిచేయువాడని, రాగరహితుడని, కైవల్యమును ప్రసాదించువాడని స్తుతించి, తన పుట్టుకకు కారణము గురించి అనేకమంది అనేకముగా తలచెదరని చెప్పి, పూర్వ జన్మలో దేవకీ వసుదేవులు చేసిన ప్రార్థనలకు సంతోషించి వారికి కుమారునిగా జన్మించావని కొందరు అంటారని, మరికొందరు, ఈ పద్యములో చెప్పిన రీతిగా అంటారని కుంతీదేవి చెప్పెను.
సాధన
మఱచి యజ్ఞాన కామ్యకర్మములఁ దిరుగు
వేదనాతురులకు దన్నివృత్తిఁ జేయ
శ్రవణ చింతన వందనార్చనము లిచ్చు
కొఱకు
నుదయించి తండ్రు నిన్ గొంద ఱభవ!
ma~raci yaj~nAna kAmyakarmamula@m dirugu
vEdanAturulaku dannivRtti@M jEya
SravaNa ciMtana vaMdanArcanamu liccu
ko~raku
nudayiMci taMDru nin goMda ~rabhava!
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)