పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

అక్షర క్రమము 163   Prev  /  Next

(తరగతి క్రమము 123)
సంసారజీమూత సంఘంబు విచ్చునే, చక్రిదాస్యప్రభంజనము లేక?
తాపత్రయాభీలదావాగ్ను లాఱునే విష్ణు సేవామృతవృష్టి లేక?
సర్వంకషాఘౌఘజలరాసు లింకునే హరి మనీషాబడబాగ్ని లేక?
ఘన విపద్గాఢాంధకారంబు లడఁగునే పద్మాక్ష నుతిరవిప్రభలు లేక?

నిరుపమా పునరావృత్తి నిష్కళంక
ముక్తినిధిఁ గానవచ్చునే ముఖ్యమైన
శార్‌ఙ్గకోదండచింతనాంజనము లేక
తామరసగర్భునకు నైన దానవేంద్ర!
ఛందస్సు (Meter): సీసము, తేటగీతి
స్కంధము (Chapter): 7
సంఖ్య (Number): 171
"భవదీయోత్కర్షముం జూపవే" (7.164) అని హిరణ్యకశిపుడు తన తనయుడు గురువులచెంత నేర్చుకొనిన విద్యలను ప్రదర్శింపుమని కోఱగా, ప్రహ్లాదుడు "తనుహృద్భాషల సఖ్యమున్, ... తొమ్మిది భక్తిమార్గముల సర్వాత్మున్ హరిన్ నమ్మి" ఉండుట మేలని బదులుపలికెను. ఈ సందర్భములో పోతనగారు భక్తిమార్గపు మెళకువలను ప్రకటించుచు నాలుగు పద్యములను ప్రహ్లాదుని నోట పలికించెను: "అంధేంధూదయముల్.." (7.168), "కమలాక్షునర్చించు కరములు కరములు..." (7.169), కంజాక్షునకుఁ గాని కాయంబు కాయమే..." (1.170), "సంసారజీమూత సంఘంబు విచ్చునే..." (7.171). అయితే ఇవి పూర్తిగా కల్పితములు కాబోవు. భాగవతములోని రెండవ స్కంధములో పరీక్షిత్తునకు శుకుడు చేసిన బోధలు ఈ కోవకు చెందినవే - ఇవి మూలమునుండి అనువదింపబడిన పద్యాలే.

వాసుదేవ శ్లోకవార్త లాలించుచుఁ గాల మే పుణ్యుండు గడుపుచుండు
నతని యాయువుదక్క నన్యుల యాయువు నుదయాస్తమయముల నుగ్రకరుఁడు
వంచించి కొనిపోవు, వాఁడది యెఱుఁగక జీవింతుఁ బెక్కేండ్లు సిద్ధ మనుచు
నంగనాపుత్ర గేహారామ విత్తాది సంసారహేతుకసంగసుఖముఁ

దగిలి వర్తింపఁ గాలంబు తఱి యెఱింగి
దండధరకింకరులు వచ్చి తాడనములు
సేసి కొనిపోవఁ బుణ్యంబు సేయ నైతిఁ
బాపరతి నాఇతి నని బిట్టు పలవరించు. (2.47)

అలరుజొంపలులతో నభ్రంకషంబులై బ్రదుకవే వనములఁ బాదపములు!
ఖాదన మేహనాకాంక్షలఁ బశువులు జీవింపవే గ్రామసీమలందు!
నియతిమై నుచ్ఛ్వాసపవనముల్ ప్రాప్తింపవే చర్మభస్త్రికములు!
గ్రామసూకర శునకశ్రేణు లింటింటఁ దిరుగవే దుర్యోగదీనవృత్తి!

నుష్ట్రఖరములు మోయవే యురుభరములఁ
బుండరీకాక్షు నెఱుఁగని పురుష్పశువు
లడవులందు నివాసములందుఁ బ్రాణ
విషయభరయుక్తితో నుంట విఫలమధిప! (2.49)

విష్ణుకీర్తనములు వినని కర్ణంబులు కొండల బిలములు కువలయేశ!
చక్రిపద్యంబులఁ జదువని జిహ్వలు గప్పల జిహ్వలు కౌరవేంద్ర!
శ్రీమనోనాథు నీక్షింపని కన్నులు కేకిపింఛాక్షులు కీర్తిదయిత!
కమలాక్షు పూజకుఁగాని హస్తంబులు శవము హస్తంబులు సత్యవచన!

హరిపద తులసీదళామోద రతిత్ళెని
ముక్కు పందిముక్కు మునిచరిత్ర!
గరుడగమను భజనగతి లేని పదములు
పాదపముల పాదపటల మనఘ! (2.50)

నారాయణుని దివ్యనామాక్షరములపైఁ గరఁగని మనములు కఠినశిలలు
మురవైరికథలకు ముదితాశ్రురోమాంచ మిళితమై యుండని మేను మొద్దు
చక్రికి మ్రొక్కని జడుని యౌదల నున్న కనకకిరీటంబు గట్టెమోపు
మాధవార్పితముగా మనని మానవు సిరి వనదుర్గచంద్రికావైభవంబు

కైటభారిభజన గలిగి యుండనివాడు
గాలిలోన నుండి కదలు శవము
కమలనాభుపదముఁ గనని వాని బ్రతుకు
పసిఁడి కాయలోని ప్రాణి బ్రతుకు. (2.51)
వ్యాఖ్య
సంసారజీమూత సంఘంబు విచ్చునే = సంసారము అను మబ్బుల గుంపులు చెదరి పోవునా;
చక్రిదాస్యప్రభంజనము లేక? = విష్ణువు యొక్క సేవ అను సుడిగాలి లేకుండగ?
తాపత్రయాభీలదావాగ్ను లాఱునే = తాపత్రయము (ఆధ్యాత్మిక, ఆధిభౌతిక, ఆధిదైవిక) అను భయంకరమైన కారుచిచ్చులు చల్లారునా?
విష్ణు సేవామృతవృష్టి లేక? = విష్ణువు సేవ అను అమృత వర్షం లేకుండగ?
సర్వంకషాఘౌఘ జలరాసు లింకునే = మితిమీరిన పాపపు గుంపుల సముద్రాలు ఇంకిపోవునా?;
హరి మనీషాబడబాగ్ని లేక? = విష్ణువు మీది బుద్ధి అను సముద్రపు అగ్ని లేకుండగ?
ఘన విపద్గాఢాంధకారంబు లడఁగునే = దట్టమైన ఆపదలు అను కారు చీకట్లు అణగిపోవునా?
పద్మాక్ష నుతిరవిప్రభలు లేక? = విష్ణుమూర్తి కీర్తనలు అను వెలుగు లేకుండగ?

నిరుపమ+అపునరావృత్తి = పోలికలేని, తిరిగిరాని;
నిష్కళంక ముక్తినిధిఁ గానవచ్చునే = మచ్చలేని ముక్తి అను నిధి కనిపించునా?;
ముఖ్యమైన శార్‌ఙ్గకోదండ చింతనాంజనము లేక = అతి గొప్పదైన శార్‌ఙ్గము అను కోదండమును ధరించినవాని (విష్ణువు) చింతన అను కాటుక లేకుండగ?;
తామరసగర్భునకు నైన = తామర నుండి పుట్టినవానికైనను (బ్రహ్మకైన)?
దానవేంద్ర! = ఓ రాక్షస రాజా (హిరణ్యకశిపా)!
సాధన
సంసారజీమూత సంఘంబు విచ్చునే, చక్రిదాస్య ప్రభంజనము లేక?
తాపత్రయాభీల దావాగ్ను లాఱునే విష్ణు సేవామృత వృష్టి లేక?
సర్వంకషాఘౌఘ జలరాసు లింకునే హరి మనీషా బడబాగ్ని లేక?
ఘన విపద్గాఢాంధ కారంబు లడఁగునే పద్మాక్ష నుతి రవిప్రభలు లేక?

నిరుపమా పునరావృత్తి నిష్కళంక
ముక్తినిధిఁ గానవచ్చునే ముఖ్యమైన
శార్‌ఙ్గ కోదండ చింతనాంజనము లేక
తామరస గర్భునకు నైన దానవేంద్ర!
saMsArajImUta saMghaMbu viccunE, cakridAsya prabhaMjanamu lEka?
tApatrayAbhIla dAvAgnu lA~runE vishNu sEvAmRta vRshTi lEka?
sarvaMkashAghaugha jalarAsu liMkunE hari manIshA baDabAgni lEka?
ghana vipadgADhAMdha kAraMbu laDa@MgunE padmAksha nuti raviprabhalu lEka?

nirupamA punarAvRtti nishkaLaMka
muktinidhi@M gAnavaccunE mukhyamaina
SAra^~mga kOdaMDa ciMtanAMjanamu lEka
tAmarasa garbhunaku naina dAnavEMdra!
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)