పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

αβ'cal 51   Prev  /  Next

(తరగతి క్రమము 56)
గురుమతులు దపసు లంతః
కరణంబుల శుద్ధి సేయ ఘనతరభక్తిన్
హరియందు సమర్పింతురు
పరమానందమున భిన్నభవబంధనులై
ఛందస్సు (Meter): కందము
స్కంధము (Chapter): 1
సంఖ్య (Number): 59
एवं प्रसन्नमनसो भगवद्भक्तियोगतः।
भगवत्तत्त्वविज्ञानं मुक्तसङ्गस्त्य जायते॥

ఏవం ప్రసన్న మనసో భగవద్భక్తియోగతః ।
భగత్తత్త్వవిజ్ఞానం ముక్తసఙ్గస్త్య జాయతే ॥
వ్యాఖ్య
[సూతుడు శౌనకాది మునులకు భాగవతకథారంభములో ఈ విధముగా చెప్పెను]

గురుమతులు = [ఇతరులకు బోధించగలిగిన] గురువులైనవారు;
తపసులు = తపస్సు చేయువారు;
అంతః కరణంబుల శుద్ధిసేయ = వారి లోపల ఉండు ఇంద్రియములను శుద్ధి చేసుకొనుటకు [అరిషడ్వర్గములను తొలగించుకొనుటకు];
ఘనతరభక్తిన్ = గాఢమైన భక్తితో;
హరియందు సమర్పింతురు = భగవంతునికి సమర్పించుకొనెదరు [వారి ఆలోచనలను, మాటలను, కార్మలను భగవంతునియందే నిలుపుదురు];
పరమానందమున = అమితమైన ఆనందముతో;
భిన్న భవబంధనులై = సంసార బంధములను వేరు చేసికొనినవారై.

ఈ పద్యము ఈ క్రింది సంస్కృత శ్లోకమునకు పోతనగారు చేసిన తెలుగు అనువాదము.

అతో వై కవయో నిత్యం భక్తిం పరమయా ముదా ।
వాసుదేవే భగవతి కుర్వంత్యాత్మప్రసాదనీం ।

ఈ మూల శ్లోకములో ఇంతటి అర్థము దాగియున్నదని పోతనగారి రచన మూలముగనే మనకు తెలియుచున్నది. ఈ శ్లోకమునకు అనువాదము సాధారణమైన కవి ఈ క్రిందివిధముగా చేసి యుండవచ్చు:

పండితులు పరమానందముతో వాసుదేవుని పూజించి మనసును ప్రసన్నము చేసుకొనెదరు.

కాని పోతనగారు ఈ శ్లోకమునకు అర్థము ఉన్నతస్థితికి తీసుకొనివెళ్ళారు. భాగవతము ఒక బోధనా గ్రంథము. ప్రతి అంశమును కూడా ఒక ఆదేశముగా గ్రహించిన దాని అంతర్యార్థము అవగతమగును. ఈ శ్లోకముద్వారా పోతనగారు ఎన్ని విషయములను మనకు తెలియజేసెనో చూడుము:
1. భక్తి యొక్క ముఖ్యోద్దేశ్యము అంతఃకరణములు (లోపలి ఇంద్రియములు) శుద్ధిజేయుట.
2. దానికి కావలసినది "ఘనతర భక్తి" - గాఢమైన భక్తి.
3. భగవంతునికి (మన మనసును, మాటలను, ఆలోచనలను) సమర్పించుకొనుట.
4. అది చేయునపుడు అమితానందముతో చేయుట.
5. సంసారబంధములను వేరు చేసికొనగలుగుట.

ఇటువంటి అనువాదము సామాన్యులు చేయగలిగినదికాదు. భక్తి మార్గములోని పరమానందమును గ్రహించిన వారే ఇటువంటి అనువాదము చేయగలరు. పోతనగారు మొదటి స్కంధములోని 19వ పద్యములో "విబుధజనుల వలన విన్నంత కన్నంత, దెలియ వచ్చినంత దేటపరుతు" అని ఎంత వినయముగా చెప్పుకున్నారో, ఇటువంటి శ్లోకములకు ఎంత అసాధారాణమైన అనువాదముగావించారో చూడుము.
సాధన
గురుమతులు దపసు లంతః
కరణంబుల శుద్ధి సేయ ఘనతరభక్తిన్
హరియందు సమర్పింతురు
పరమానందమున భిన్నభవబంధనులై
gurumatulu dapasu laMta@H
karaNaMbula Suddhi sEya ghanatarabhaktin
hariyaMdu samarpiMturu
paramAnaMdamuna bhinnabhavabaMdhanulai
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)