పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

తరగతి క్రమము 114   Prev  /  Next

ఈశ్వరమూర్తియైన కాలంబునంజేసి వృక్షంబు గలుగుచుండ ఫలంబునకు
జన్మసంస్థాన వర్ధనాపక్షీణత్వ పరిపాకనాశంబులు ప్రాప్తంబులైన తెఱంగున
దేహంబునకుంగాని షడ్భావ వికారంబు లాత్మకు లేవు.
ఛందస్సు (Meter): వచనము
స్కంధము (Chapter): 7
సంఖ్య (Number): 237
తను తన తల్లి గర్భమునందున్న సమయమున నారదుడు వచించినట్లుగా ప్రహ్లాదుడు ఇట్లు పలికెను. ఈ వచనము ఈ క్రింది సంస్కృత శ్లోకమునకు పోతనగారు చేసిన తెలుగు అనువాదము.

जन्माद्याः षडिमे भावा दृष्टा देहस्य नात्मनः ।
फलानामिव वृक्षस्य कालेनेश्वरमूर्तिना ॥

జన్మాద్యాః షడిమే భావా దృష్టా దేహస్య నాత్మనః ।
ఫలానామివ వృక్షస్య కాలేనేశ్వరమూర్తినా ॥
వ్యాఖ్య
కాలము భగవంతుని రూపమని, ఈ కాలానికి లోబడి దేహముండునుగాని, ఆత్మ అతీతమైనదని నారదుని ఉవాచ. ఉదాహరణగా చెట్టు, చెట్టుకు కలిగే ఫలమును చూపబడినది. చెట్టు నిలిచియుండును. కాని దానికి కలిగే పూలు, ఫలములు పుట్టి - ఆరు మార్పులనొంది - ౘనిపోవును. అటులనే ఎట్టి మార్పులకు లోను కాకుండగ ఆత్మ నిలిచియుండును, కాని దానికి అంటుకున్న భౌతిక శరీరము పుట్టి - ఆరు మార్పులనొంది - ౘనిపోవును. చెట్టు వలన ఫలము కలుగును - ఆత్మ వలన శరీరము లభించును. కాని ఫలము వలన చెట్టు కలుగదు - ఆత్మ శరీరముపై ఆధారపడదు. ఇట్టి ఆత్మకుగల లక్షణములను తరువాతి వచనములో ఇవ్వబడినవి.

ఈశ్వరమూర్తియైన కాలంబునంజేసి = భగవంతునియొక్క రూపమయిన కాలము వలన;
వృక్షంబు గలుగుచుండ ఫలంబునకు = చెట్టుకు కలిగే ఫలమునకు (పువ్వుకు, కాయకు);
జన్మ = పుట్టుక [సూక్ష్మ రూపం / జన్మనొందుట];
సంస్థాన = ఎదుగుదల [స్థూల రూపము / బాల్యము];
వర్ధన = బలపడుట లేదా ఎక్కువగా పెరుగుట, వృద్ధినొందుట [యౌవనము];
అపక్షీణత్వ = తరిగిపోవుట [వయసు మళ్ళుట];
పరిపాక = పండిపోవుట [ముసలితనము];
నాశంబులు = చనిపోవుట [మరణము];
ప్రాప్తంబులైన తెఱంగున = లభించిన విధముగ;
దేహంబునకుంగాని = శరీరమునకు కలుగును కాని;
షడ్భావ వికారంబులు = ఈ ఆరు పరిణామములు (మార్పులు);
ఆత్మకు లేవు = ఆత్మకు కలుగవు;
సాధన
ఈశ్వరమూర్తియైన కాలంబునంజేసి వృక్షంబు గలుగుచుండ ఫలంబునకు
జన్మసంస్థాన వర్ధనాపక్షీణత్వ పరిపాకనాశంబులు ప్రాప్తంబులైన తెఱంగున
దేహంబునకుంగాని షడ్భావ వికారంబు లాత్మకు లేవు.
ISvaramUrtiyaina kAlaMbunaMjEsi vRkshaMbu galugucuMDa phalaMbunaku
janmasaMsthAna vardhanApakshINatva paripAkanASaMbulu prAptaMbulaina te~raMguna
dEhaMbunakuMgAni shaDbhAva vikAraMbu lAtmaku lEvu.
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)