పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

తరగతి క్రమము 55   Prev  /  Next

ఈశ్వరుండు గానంబడినఁ
జిజ్జడ గ్రథన రూపంబైన యహంకారంబు భిన్నంబగుఁ;
నహంకారంబు భిన్నంబైన
నసంభావనాది రూపంబులగు సంశయంబులు విచ్ఛిన్నంబులగుఁ;
సంశయవిచ్ఛేదంబైన ననారబ్ధఫలంబులైన
కర్మంబులు నిశ్శేషంబులై నశించు [నశించుం గావున].
ఛందస్సు (Meter): వచనము
స్కంధము (Chapter): 1
సంఖ్య (Number): 58
ఈ వచనము ఈ క్రింది సంస్కృత శ్లోకమునకు పోతనగారు చేసిన తెలుగు అనువాదము.

भिद्यते हृदयग्रन्थिश्चिद्यन्ते सर्वसंशयाः ।
क्षियन्ते चास्य कर्मणि दृष्ट एवात्मनीश्वरे ॥

భిద్యతే హృదయగ్రంథిశ్ఛిద్యంతే సర్వసంశయాః ।
క్షీయంతే చాస్య కర్మాణి దృష్ట ఏవాత్మనీశ్వరే ॥
వ్యాఖ్య
[భాగవత కథాప్రారంభములో సూతుడు ఈ విధముగా చెప్పెను:]

ఈశ్వరుండు గానంబడినఁ = (ఆత్మయందు) ఈశ్వరుని చూసినపుడు;
చిజ్జడ గ్రథన రూపంబైన యహంకారంబు = అజ్ఞాన రూపమైన అహంకారము;
భిన్నంబగుఁ = వేరై పోవును (అనగా తొలగి పోవును);
అహంకారంబు భిన్నంబైన = (అట్లు) అహంకారంబు భిన్నమైనపుడు;
అసంభావనాది రూపంబులగు = అర్థముకాని;
సంశయంబులు విచ్ఛిన్నంబులగుఁ = సందేహములు తొలగిపోవును;
సంశయవిచ్ఛేదంబైన = సందేహములు తొలగినప్పుడు;
అనారబ్ధఫలంబులైన కర్మంబులు = ఫలితమే ధ్యేయమైన కర్మలు (కామ్య కర్మలు);
నిశ్శేషంబులై నశించు = పూర్తిగా నశించును;

"హృదయగ్రంథిశ్ఛిద్యంతే" అనగా హృదయములోని ముడులు వీడిపోవును అనియున్న మూలమునకు పోతనగారు "చిజ్జడ గ్రథన రూపంబైన యహంకారంబు భిన్నంబగు" అని అనువదించారు. నిజముగా "హృదయములోని ముడులు" అనగానేమిటి? పోతనగారి ప్రకారము అవి జయించుటకు అతికష్టమైన అహంకారము అని అర్థము. ఈ వచనములో మూడు విషయములు చెప్పబడినవి. ఆత్మయందు పరమాత్మస్వరూపమును చూసినపుడు తొలగిపోవునవి మూడు: FUD (1) False ego (అహంకారము), (2) Uncertainty (సంశయము), (3) Deeds (కర్మలు). ఇచ్చట ఒక గొప్ప రహస్యము కూడా సూచింపబడినది. సహజముగా కర్మలద్వారా సంశయములు తొలగించుకొని, అటుపై అహంకారమును తొలగించుకొనిన భగవంతుని చూడగలరు. కాని ఇచ్చట భక్తిద్వారా సత్వగుణంబును అలవరచుకొని, ఈశ్వరునిగాంచి [పూర్వపు వచనభాగము] అపుడు అవలీలగా అహంకారమును, సంశయములను, తరువాత కామ్యకర్మలను తొలగించుకొనవచ్చని - ఇది సులభమైన మార్గమనియు - సూచించబడినది.
సాధన
ఈశ్వరుండు గానంబడినఁ
జిజ్జడ గ్రథన రూపంబైన యహంకారంబు భిన్నంబగుఁ;
నహంకారంబు భిన్నంబైన
నసంభావనాది రూపంబులగు సంశయంబులు విచ్ఛిన్నంబులగుఁ;
సంశయవిచ్ఛేదంబైన ననారబ్ధఫలంబులైన
కర్మంబులు నిశ్శేషంబులై నశించు [నశించుం గావున].
ISvaruMDu gAnaMbaDina@M
jijjaDa grathana rUpaMbaina yahaMkAraMbu bhinnaMbagu@M;
nahaMkAraMbu bhinnaMbaina
nasaMbhAvanAdi rUpaMbulagu saMSayaMbulu vicCinnaMbulagu@M;
saMSayavicCEdaMbaina nanArabdhaphalaMbulaina
karmaMbulu niSSEshaMbulai naSiMcu [naSiMcuM gAvuna].
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)