పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

అక్షర క్రమము 142   Prev  /  Next

(తరగతి క్రమము 9)
లలిత స్కంధము కృష్ణమూలము, శుకాలాపాభిరామంబు, మం
జులతా శోభితమున్, సువర్ణ సుమన స్సుజ్ఞేయమున్, సుందరో
జ్జ్వలవృత్తంబు, మహాఫలంబు, విమల వ్యాసాల వాలంబునై
వెలయున్, భాగవతాఖ్య కల్పతరు వుర్విన్ సద్ద్విజ శ్రేయమై.
ఛందస్సు (Meter): మత్తేభము
స్కంధము (Chapter): 1
సంఖ్య (Number): 22
వ్యాఖ్య
భాగవతానువాదమునకు ముందు పోతనగారు భాగవతమును గురించి వ్రాసిన పద్యము.

ఒక అర్ధము:

లలిత స్కంధము = సుందరమైన బోదె (trunk) కలది;
కృష్ణ మూలము = నల్లని వేరు కలది;
శుక + ఆలాప + అభిరామంబు = చిలుక పలుకులతో మనోహరమైనది;
మంజు లతా శోభితమున్ = మనసుకు ఇంపైన కొమ్మలతో ప్రకాశించుచున్నది;
సువర్ణ సుమన స్సుజ్ఞేయమున్ = బంగారపు పూలతో తెలియబడుచున్నది;
సుందర + ఉజ్వల వృత్తంబు = అందముగా ప్రకాశించుచు చుట్టబడినది;
మహాఫలంబు = ఎక్కువగా పండినది;
విమల వ్యాస + ఆలవాలంబునై వెలయున్ = నిర్మలమైన పెద్దదైన పాదులతో ఆవిర్భవించినది;
భాగవతాఖ్య కల్పతరువు + ఉర్విన్ = భాగవతము అనే కల్ప వృక్షము (wishing tree) ఈ భూమిలో;
సద్ద్విజ శ్రేయమై = ఉత్తమమైన పక్షుల శ్రేయస్సు కొఱకు;

మఱొక అర్ధము:

లలిత స్కంధము = మనస్సుకు ఆహ్లాదమైన ప్రకరణములు (chapters) కలది;
కృష్ణ మూలము = శ్రీ కృష్ణ పరమాత్మయే గ్రంథానికి మూలముగా (central) కలది;
శుక + ఆలాప + అభిరామంబు = శుక మహర్షి ఆలాపించగా రమ్యమైనది (engaging);
మంజు లతా శోభితమున్ = మనసుకు ఇంపైన తీగెల వలె (కథలు) కలిగినది;
సువర్ణ సుమన స్సుజ్ఞేయమున్ = బంగారపు వన్నెగల భగవంతుని తెలియజేయుచున్నది;
సుందర + ఉజ్వల వృత్తంబు = చక్కని దివ్యమైన వర్ణనలు గలది;
మహాఫలంబు = ఎక్కువగా ప్రయోజనము చేకూర్చునది;
విమల వ్యాస + ఆలవాలంబునై వెలయున్ = పవిత్రమైన వ్యాసుని రచనాశైలితో వెలుగుచున్నది;
భాగవతాఖ్య కల్పతరువు + ఉర్విన్ = భాగవతము అనే కల్ప వృక్షము ఈ భూమిలో;
సద్ద్విజ శ్రేయమై = బ్రహ్మజ్ఞానమునందు కోరికగలిగిన (బ్రాహ్మణుల) లో ఉత్తమమైన వారి శ్రేయస్సు కొఱకు;

ముఖ్యమైన ద్వందార్ధ పదాలు:

స్కంధము = బోదె (trunk) / ప్రకరణము (chapter)
శుక = చిలుక / శుక మహర్షి
కృష్ణ = నల్ల / శ్రీ కృష్ణ పరమాత్మ
మూలము = వేరు / ఆధారము
లత = కొమ్మ / భాగము (లేదా కథా సంఫుటము)
సుమనస్ = పువ్వు / విద్వాంసుడు
వృత్తంబు = చుట్టుగా లేదా గుండ్రము / రచనా శైలి
ఫలంబు = పండినది / ఫలితము
వ్యాస = పాదు / వ్యాస మహర్షి
ద్విజ = పక్షి / బ్రాహ్మణుడు
సాధన
లలిత స్కంధము కృష్ణమూలము, శుకాలాపాభిరామంబు, మం
జులతా శోభితమున్,
సువర్ణ సుమన స్సుజ్ఞేయమున్, సుందరో
జ్జ్వలవృత్తంబు,
మహాఫలంబు, విమల వ్యాసాల వాలంబునై
వెలయున్,
భాగవతాఖ్య కల్పతరు వుర్విన్ సద్ద్విజ శ్రేయమై.
lalita skaMdhamu kRshNamUlamu, SukAlApAbhirAmaMbu, maM
julatA SObhitamun,
suvarNa sumana ssujnEyamun, suMdarO
jjvalavRttaMbu,
mahAphalaMbu, vimala vyAsAla vAlaMbunai
velayun,
bhAgavatAkhya kalpataru vurvin saddvija SrEyamai.
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)