పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

తరగతి క్రమము 12   Prev  /  Next

ధీరులు నిరపేక్షులు నా
త్మారాములునైన మునులు హరిభజనము ని
ష్కారణమ చేయుచుందురు
నారాయణుఁ డట్టివాఁడు నవ్య చరిత్రా!
ఛందస్సు (Meter): కందము
స్కంధము (Chapter): 1
సంఖ్య (Number): 138
ఈ పద్యము ఈ క్రింది సంస్కృత శ్లోకమునకు పోతనగారు చేసిన తెలుగు అనువాదము:

आत्मारामाश्च मुनयो निर्ग्रन्था अप्युरुक्रमे।
कुर्वन्त्यहैतुकीं भक्तिमित्थम्भूतगुणो हरिः॥

ఆత్మారామాశ్చ మునయో నిర్గ్రంథా అప్యురుక్రమే।
కుర్వంత్యహైతుకీం భక్తిమిత్థంభూతగుణో హరిః॥
వ్యాఖ్య
భాగవతాన్ని వేద వ్యాసుడు తన కుమారుడైన శుకుని చే చదివించెను. అయితే శుకుడు పుట్టుకతోనే యోగి. ఆయనకు మోక్షము యందు మాత్రమే కోరిక కలిగి ఇంక ఎటువంటి కోరికలు లేని వాడు. మఱి అటువంటి యోగిచే భాగవతాన్ని చదివించవలసిన అవసరమేమిటని శౌనకుడు ప్రశ్నించగా, సూతుడు ఈ పద్యములో చెప్పిన రీతిగా చెప్పెను: జ్ఞానమును కలిగిన జనులు, ఏ కోరికలు లేని గుణవంతులు, ఆత్మ జ్ఞానము ను కలిగిన మునులు - వీరందరు ఎటువంటి కారణము లేకుండగనే హరి నామాన్ని స్మరిస్తూ, భజిస్తూ ఉంటారు - ఎందుకంటే భగవంతుడు అటువంటి వాడు (అనగా వారికి భగవంతుడు ప్రతి వస్తువులోను గోచరించును కనుక వారు భగవంతుని స్మరించకుండా ఉండలేరు అని అర్ధము.)

ధీరులు = దైర్యవంతులు లేదా విద్వాంసులు (scholarly people);
నిరపేక్షులు = కోరికలు లేని వారు;
ఆత్మ + ఆరాములునైన మునులు = ఆత్మ జ్ఞానమును కలిగిన మునులు;
హరి భజనము = (సర్వాంతర్యామి యైన) హరి యొక్క భజనలను;
నిష్కారణమ చేయుచుందురు = ఎటువంటి కారణము లేకుండగనే (without any reason) చేసెదరు;
నారాయణుడట్టివాడు = నారాయణుడు అటువంటి (గొప్ప) వాడు;
నవ్య చరిత్రా = పొగడ దగిన చరిత్ర గల రాజా (అని శుకుడు పరీక్షిత్తు మహరాజును ఉద్దేశించి పలికెను).
సాధన
ధీరులు నిరపేక్షులు నా
త్మారాములునైన మునులు
హరిభజనము ని
ష్కారణమ చేయుచుందురు
నారాయణుఁ డట్టివాఁడు నవ్య చరిత్రా!
dhIrulu nirapEkshulu nA
tmArAmulaina munulu
haribhajanamu ni
shkAraNama cEyucuMduru
nArAyaNu@M DaTTivA@MDu navya caritrA!
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)