పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

αβ'cal 1   Prev  /  Next

(తరగతి క్రమము 105)
అచ్చపుఁ జీఁకటిం బడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై
చచ్చుచుఁ బుట్టుచున్ మరలఁ జర్వితచర్వణు లైన వారికిం
జెచ్చెరఁ బుట్టునే పరులు సెప్పిననైన నిజేచ్ఛనైన నే
మిచ్చిన నైనఁ గానలకు నేఁగిన నైన హరి ప్రబోధముల్?
ఛందస్సు (Meter): ఉత్పలమాల
స్కంధము (Chapter): 7
సంఖ్య (Number): 181
ప్రహ్లాదుడు తన తండ్రి హిరణ్యకశిపుని ప్రశ్నలకు ఈ విధముగా సమాధామిచ్చెను. ఈ పద్యము ఈ క్రింది సంస్కృత శ్లోకమునకు పోతనగారు చేసిన తెలుగు అనువాదము:

मतिर्न कृष्णो परतः स्वतो वा मिथोऽभिपद्येत गृहव्रतानाम् ।
अदान्तगोभिर्विशतां तमिस्रं पुनः पुनश्चर्वितचर्वणानाम् ॥

మతిర్న కృష్ణో పరతః స్వతో వా మిథోభిపద్యేత గృహవ్రతానాం ।
అదాంతగోభిర్విశతాం తమిస్రం పునః పునశ్చర్వితచర్వణానాం ॥
వ్యాఖ్య
గురువులచెంత విద్యలను నేర్చుకొంటివి, మరి నీ గొప్పతనాన్ని ["భవదీయోత్కర్షముం" (7.164)] చూపమని హిరణ్యకశిపుడు ప్రశ్నించగా, ప్రహ్లాదుడు ఇట్లు పలుకనారంభించును:

"చదివించిరి నను గురువులు
చదివితి ధర్మార్థముఖ్యశాస్త్రంబులు నేఁ
జదివినవి గలవు పెక్కులు
చదువులలో మర్మమెల్లఁ జదివితిఁ దండ్రీఁ (7.166)."

ఇంకా, నవవిధ మార్గములలో ఏదియో ఒకటి ఎంచుకొని ["తనుహృద్భాషల సఖ్యమున్..." (7.167)] భగవంతుని నమ్మియుండుట శ్రేయస్కరమని తను భావించెదనని చెప్పును. ఈ సందర్భములో పోతనగారు "కమలాక్షునర్చించు కరములు కరములు..." (7.169) అను పలుకులను కూడా పలికించును.

ఈ మాటలు విని హిరణ్యకశిపుడు కోపముతో "విరోధిశాస్త్రముల్" (7.173) తన కుమారునికి చెప్పి, తనను మోసం చేసినట్లు నమ్మి, గురుపుత్రుని నిజముగా "యథార్థపు బ్రాహ్మణుండవే?" (7.173) అని ప్రశ్నించును. దానికి వారు "తప్పులు లేవు మా వలన దానవనాథ", ఇదియంతము "మీ కుమారునకు... నైజమీష" (స్వయంబుద్ధి) (7.176) మాత్రమే అని చెప్పి, ఇంకా "నీ పుత్రుని నిటువలెఁ జేయఁగ శత్రులమే?" (7.177) అని నచ్చచెప్పును.

అప్పుడు హిరణ్యకశిపుడు గురువులు చెప్పని బోధలు ఇంకెవరు చెప్పితిరని ప్రహ్లాదుని ప్రశ్నించును. ఈ ప్రశ్నకు ప్రహ్లాదుడు ఈ పద్యములో చెప్పిన విధముగా సమాధానమిచ్చును.

అచ్చపుఁ జీఁకటిం బడి = కటిక చీకటిలో పడిపోయి;
గృహవ్రతులై = ప్రాపంచిక విషయములకు వశమై;
విషయ ప్రవిష్టులై = ఇంద్రియానుభవములకు స్వాధీనమై;
చచ్చుచుఁ బుట్టుచున్ = జనన మరణ చక్రములో చిక్కుకొని;
మరలఁ జర్వితచర్వణు లైన వారికిం = అనుభవించినవాటిని మరల మరల అనుభవించగోరిన వారికి;
జెచ్చెరఁ బుట్టునే = [భగవజ్ఞానము] శీఘ్రముగా పుట్టునా?
పరులు సెప్పిననైన = ఇతరులు ఎంత చెప్పినను;
నిజేచ్ఛనైనన్ = స్వయంకృత వాంఛతోగాని;
ఏ మిచ్చిన నైనఁ = ఏమి ఇచ్చినను;
గానలకు నేఁగిన నైన = (చివరకు) అడవులకేగినను;
హరి ప్రబోధముల్ = భగవంతుని జ్ఞానము;
సాధన
అచ్చపుఁ జీఁకటిం బడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై
చచ్చుచుఁ బుట్టుచున్ మరలఁ జర్విత చర్వణు లైన వారికిం
జెచ్చెరఁ బుట్టునే పరులు సెప్పిననైన నిజేచ్ఛనైన నే
మిచ్చిన నైనఁ
గానలకు నేఁగిన నైన హరి ప్రబోధముల్?
accapu@M jI@MkaTiM baDi gRhavratulai vishaya pravishTulai
caccucu@M buTTucun marala@M jarvita carvaNu laina vArikiM
jeccera@M buTTunE parulu seppinanaina nijEcCanaina nE
miccina naina@M
gAnalaku nE@Mgina naina hari prabOdhamul?
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)