పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

అక్షర క్రమము 81   Prev  /  Next

(తరగతి క్రమము 94)
తనుహృత్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనా
ర్చనముల్ సేవయు నాత్మలో నెఱుకయున్ సంకీర్తనల్ చింతనం
బను నీ తొమ్మిదిభక్తిమార్గముల సర్వాత్మున్ హరిన్ నమ్మి స
జ్జనుఁడై యుండుట భద్రమంచుఁ దలఁతున్ సత్యంబు దైత్యోత్తమా
ఛందస్సు (Meter): మత్తేభము
స్కంధము (Chapter): 7
సంఖ్య (Number): 167
చదువులలో గల మర్మమెల్ల ఇదియేనని తన తండ్రికి ప్రహ్లాదుడు చెప్పిన మాటలు. ఈ పద్యము ఈ క్రింది సంస్కృత శ్లోకములకు పోతనగారు చేసిన తెలుగు అనువాదము:

प्रह्लाद उवाच​
श्रवणं कीर्तनं विष्णोः स्मरणं पादसेवनम्।
अर्चनं वंदनं दास्यं सख्यमात्मनिवेदनम्॥
इति पुंसार्पिता विष्णौ भक्तिश्चेन्नवलक्षणा।
क्रियते भगवत्यद्धा तन्मन्येऽ धीतमुत्तमम्॥

ప్రహ్లాద ఉవాచ
శ్రవణం కీర్తనం విష్ణౌః స్మరణం పాదసేవనమ్।
అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మనివేదనమ్॥
ఇతి పుంసార్పితా విష్ణౌ భక్తిశ్చైన్నవలక్షణా।
క్రియతే భగవత్యద్ధా తన్మన్యే ధీతముత్తమమ్॥
వ్యాఖ్య
శుక్రాచార్యుని కుమారులైన శండుడు అమర్కుడు - వీరిరువురిని హిరణ్యకశిపుడు తన కుమారుడైన ప్రహ్లాదునికి నీతి శాస్త్రములను నేర్పుమని [7.130-7.133] అప్పగించెను. వారు "పాఠయోగ్యములు పెక్కులు శాస్త్రములు" [7.134] ఆ కుమారునిచే "పఠింపించె"ను. ప్రహ్లాదుడు "చలింపని వైష్ణవభక్తి పూర్ణుడై ఏ పగిది వారు సెప్పిన, నా పగిదిం జదువుఁగాని" [7.134-7.135] ఆ విద్యలన్నియు "మిథ్యలని" [7.135] నిశ్చయముతో ఉండెను. కొంతకాలమునకు "గురువులేజాడం బఠింపించిరో"యని తెలుసుకునేందుకు కుమారుని రావించి "వాత్సల్య సంపూర్ణుడై యుత్సంగాగ్రముఁ జేర్చి" (ఒడిలో చేర్చుకొని) [7.139] "పుత్రా నీకెయ్యది భద్రంబై యున్నది సెప్పు"ము [7.141] అని అడిగెను. ప్రహ్లాదుడు, "ఎల్ల శరీరధారులకు" ఇల్లు అను "చీకటినూతిలోపలం" పడిపోవక మీరు-మేము అను "మతిభ్రమణంబున" ప్రవర్తింపక "విష్ణునందుల్లముఁ జేర్చి" "అడవి నుండుట" మేలని చెప్పెను [7.142]. దీనికి హిరణ్యకశిపుడు నవ్వుతూ, ఇతర శిశువులు "ఎట్టాడిన న ట్టాడుదు"రు, మరి నీకు ఈ బుద్ధి "నీకున్ లోపలఁ దోఁచెనో? పరుల్ దుర్నీతుల్ పఠింపించిరో?" అని, రాక్షసులకు కీడు చేసిన విష్ణువును "వర్ణింప నీకేటికిన్?" [7.144-145] అని చెప్పి, "హరి యంచున్ గిరి యంచు నేల చెడ మోహాంధుడవై పుత్రకా!" [1.146] అని అడిగెను.

బదులుగా ప్రహ్లాదుడు పురోహితులను జూసి "ఇను మయస్కాంత సన్నిధి" ఎట్లు ఆకర్షింపబడునో, "దైవయోగమునఁ జేసి" నా మనసు "హృషీకేశుసన్నిధి" చేరుచున్నదనెను [7.149]. ఇచ్చటనే పోతనగారు "మందార మకరంద మాధుర్యమునఁ దేలు మధుపంబు వోవునే మదనములకు" [7.150] అను పద్యమును ప్రహ్లాదునిచే పలికించెను.

ఈ పలుకులకు రాజ పురోహితులు ప్రహ్లాదుడు "దైత్య చందనవనమందుఁ గంటకయుత క్షితిజాతముభంగి" [7.153] (చందన వనము వంటి రాక్షస కులములో ముళ్ళ చెట్టు వలె) జన్మించెను, ఇక వీనికి "నిపుణతతో" "కోపించి", "దండించి" [7.154] చదివింతుము అని చెప్పి ప్రహ్లాదుని కొనిపోయెను. కొనిపోయి ప్రహ్లాదునకు "మార్గము చెడకుండఁ బెక్కు మాఱులు" "వర్గ త్రితము" (ధర్మ, అర్థ, కామములను) బోధించెను [7.156], ఇంకా "సామ, దాన, దండోపాయంబు" లన్నియు బోధించి, ఇక ప్రహ్లాదుడు "నీతికోవిదుండయ్యె నని నమ్మి" [7.157], ప్రహ్లాదుని కొని వచ్చి తన తల్లిచే అలంకరింపజేసి, మేమిదివరకు జెప్పిన నీతులు తప్ప ఇంకేమీ తన తండ్రికి చెప్పకుమని బుజ్జగించి [7.157-7.159] హిరణ్యకశిపుని దగ్గరకు కొనివచ్చి, "వీక్షింపుము నీ కుమారు విద్యాబలమున్" [7.161] అని పలికెను.

హిరణ్యకశిపుడు తన కుమారుని "గాఢాలింగనంబు సేసి, తన తొడలమీఁద నిడుకొని", "ప్రేమాతిరేక సంజనిత బాష్పసలిలబిందు సందోహంబుల నతని వదనారవిందంబు దడుపుచు, మందమధురాలాపంబుల" [7.162], గురువులు నీకు "యే మేమి సంవేద్యాంశంబులు సెప్పిరో?" [7.163] తనకు చెప్పమని, "ఎన్నఁడు నీవు నీతివిదుడ"వు అగుదువో యని "మహావాంఛతో నున్నాఁడను" [7.164] అని పలికెను.

అప్పుడు ప్రహ్లాదుడు "చదివించిరి నను గురువులు, చదివితి ధర్మార్థముఖ్యశాస్త్రంబులు" పెక్కులు అని, "చదువులలో మర్మమెల్లఁ జదివితిఁ దండ్రీ" [7.166] అని పలికి, ఆ మర్మమేమిటో ఈ పద్యములో చెప్పిన విధముగా చెప్పెను -

తొమ్మిది భక్తిమార్గములలో [తగినవి ఎంచుకొని], సర్వాత్ముడైన భగవంతుని నమ్మి యుండుట అన్నిటికంటె ఉత్తమము అని ప్రహ్లాదుడు చెప్పెను. ఆ తొమ్మిది భక్తి మార్గములు:

(1) తనువు, హృదయము, భాషల యందు (కర్మలు, మనస్సు, మాటల యండు) స్నేహము,
(2) శ్రవణము,
(3) దాస్యము,
(4) వందనము,
(5) అర్చనము,
(6) సేవ,
(7) ఆత్మలోనెఱుక (ఆత్మనివేదనము),
(8) సంకీర్తనము,
(9) చింతనము.
సాధన
తనుహృత్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనా
ర్చనముల్
సేవయు నాత్మలో నెఱుకయున్ సంకీర్తనల్ చింతనం
బను
నీ తొమ్మిదిభక్తిమార్గముల సర్వాత్మున్ హరిన్ నమ్మి
జ్జనుఁడై యుండుట
భద్రమంచుఁ దలఁతున్ సత్యంబు దైత్యోత్తమా
tanuhRtbhAshala sakhyamun SravaNamun dAsatvamun vaMdanA
rcanamul
sEvayu nAtmalO ne~rukayun saMkIrtanal ciMtanaM
banu
nI tommidibhaktimArgamula sarvAtmun harin nammi sa
jjanu@MDai yuMDuTa
bhadramaMcu@M dala@Mtun satyaMbu daityOttamA
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)