ఒకప్పుడు అరణ్యంలో ఒక చెట్టుపైన ఒక కొంగా, ఒక కాకీ నివసిస్తూ (living) ఉండేవి. కాకి చాలా చెడ్డది. ఆ సంగతి తెలిసిగూడా, "మనం మంచివాళ్లమైతే ఇతరుల చెడు మనై ఏం చేస్తుంది?" అనుకుని కొంగ కాకితో సహవాసం (friendship) సాగించింది.
ఒకనా డొక ప్రయాణీకుడు (traveler) అటుగా వచ్చి ఎండ జాస్తిగా (more) ఉండడంచేత ఆ చెట్టునీడను పడుకుని నిద్రపోయాడు. కొంత సేపటికి ఆ ప్రయాణీకుడి ముఖంమీదికి ఎండ వచ్చింది. ఈ సంగతి గమనించి, మంచిబుద్ధి గల కొంగ తన రెక్కలను చాచి నిద్రపోయేవాడి ముఖంమీద నీడ పడేలాగు చేసింది.
కొంగను చూసి నవ్వి, కాకి వెటకారంగా (ridiculing) ప్రయాణీకుడి పైన ఒక రాయి పడవేసి చెట్టుపైనుంచి ఎగిరిపోయింది. రాయిపాటుకు ప్రయాణీకుడు బాధతో లేచి, పైకి చూశాడు. అతనికి చెట్టుపైన ఉన్న కొంగ కనిపించింది. అదే తనపై రాయి వేసి ఉంటుందనుకుని అతను ఆ రాయి విసిరి కొంగను బలంగా కొట్టాడు. ఆ దెబ్బకు కొంగ క్రిందపడి ప్రాణాలు విడిచింది.