అడిగెదనని
పద్యము:
అడిగెద నని కడువడిఁ జను
నడిగినఁ దను మగుడ నుడుగఁ డని నడ యుడుగున్,
వెడవెడ సిడిముడిఁ తడఁబడ,
నడు గిడు
నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్
aDigeda nani kaDuvaDi@M janu
naDigina@M danu maguDa nuDuga@M Dani naDa yuDugun
veDaveDa siDimuDi@M taDabaDa
naDu giDu
naDugiDadu jaDima naDugiDu neDalan
పోతనగారు వ్యాసుడు రచించిన సంస్కృత భాగవతమును అత్యద్భుతముగ తెలుగునకు అనువదించెను.
ఈ పద్యము భాగవతములోని గజేంద్రమోక్షణము అను కథనుండి గ్రహించడమైనది.
గజేంద్రుడు మొసలినోటిలో పడిపోయి మరణము చేరువైయుండి, తనప్రాణరక్షణకు సర్వాంతర్యామియైన విష్ణురూపమును ప్రార్థించెను.
ఆ‌ ప్రార్థన విష్ణువుకు వినిపించెను. తన ఇల్లాలైన లక్ష్మీదేవినికూడ మరచిపోయి, తక్షణమే గజేంద్రుని రక్షించుటకు బయలుదేరెను.
ఈ సందర్భములో లక్ష్మీదేవి, తన భర్త ఎచటికి వెళ్తున్నాడో అడుగవలెనని అనుకొన్నది.
కాని అడుగుటకు సందేహించినది. ఆ పరిస్థితిలో తన మనోభావాన్ని అక్షరాలలోనే చొప్పించారు పోతనగారు:
తాత్పర్యము:
నీవెచటికి వెడలుచున్నా వని అడుగవలెనని వేగంగ తనభర్తవైపు కదిలింది లక్ష్మీదేవి.
ఒకవేళ తను అడిగినాకూడ తనభర్త బదులుపలుకడేమోనని అక్కడే ఆగిపోయింది.
అప్పుడు తను అడుగువేసీవేయకముందే గందరగోళం, చికాకు ఒకేసారి కలిగి, ఆ వేసిన అడుగును వెనుతీసికొన్నది.