అప్పిచ్చువాడు
పద్యము:
అప్పిచ్చువాడు, వైద్యుడు
ఎప్పుడు నెడతెగక పాఱు నేఱును, ద్విజుడున్
చొప్పడిన యూర నుండుము
చొప్పడకున్నట్టి యూరు జొరకుము సుమతీ!
appiccuvADu, vaidyuDu
eppuDu neDategaka pA~ru nE~runu, dvijuDun
coppaDina yUra nuMDumu
coppaDakunnaTTi yUru jorakumu sumatI!
ఓ సత్గుణవంతుడా! నీవు ఎచ్చట నివసించవలెనో తెలిసికొనుము.
నీవు నివసించు ఊరిలో అవసరమైనపుడు డబ్బును అప్పుగా ఇచ్చు వారు ఉండవలెను.
నీవు జబ్బునపడినపుడు నయం చేయుటకు వైద్యుడు ఉండవలెను.
పాడిపంటలకొరకు ఎల్లప్పుడు ప్రవహించే ఏరు ఉండవలెను.
అంతే కాదు, సర్వకాలములందు సన్మార్గమును బోధించు బ్రాహ్మణుడు ఉండవలెను.
ఈ సదుపాయములు లేని ఊరిలో నివసించుట తగదు.