ఇంటిపని-౧: పద్యములు, తాత్పర్యములు
పద్యములు:
కొంపగాలు వేళ గునపంబు చేబూని
బావి త్రవ్వ నేమి ఫలము గలుగు
ముందు చూపు లేని మూర్ఖుండు చెడిపోవు
లలితసుగుణజాల తెలుగుబాల
సత్ప్రవర్తనంబు, సౌఖ్యంబు, మర్యాద
మంచి వారి పొందు మనకు నిచ్చు
కలుషమతుల పొందు కలహాలు గొనితెచ్చు
లలిత సుగుణజాల తెలుగుబాల
కలిమి గలుగ నేస్తగాండ్రు వేలకు వేలు
కలిమి లేక చెలిమికాండ్రు లేరు
లేమివేళ మిత్రులే ప్రాణమిత్రులు
లలిత సుగుణజాల తెలుగుబాల
తగిలినంత మేర దహియించు కొనిపోవు
చెడ్డవాని చెలిమి చిచ్చువోలె
మంచివాని మైత్రి మలయ మారుత వీచి
లలిత సుగుణజాల తెలుగుబాల
తాత్పర్యములు:
లలిత సుగుణాల ఓ తెలుగుబాల!
ముందుచూపు లేనివారలు మూర్ఖులై నష్టపోవుదురు.
ఉదాహరణకు ముందుచూపు లేక ఇంటిని కాపాడుకొనే సూత్రములను పాటించక
ప్రమాదములో తన యిల్లు కాలిపోయిన వేళ వరకు ఆగి
అప్పటికప్పుడు నీటి కొఱకు ఒక గునపముతో బావిని త్రవ్వుట వలన
సకాలములో ఫలితము కలుగదు కదా!
కనుక ముందుచూపుతో పనులు చేసికొనుట ఎంతో లాభదాయకము.
లలిత సుగుణాల ఓ తెలుగుబాల!
చెడ్డవారితో స్నేహము చేసిన యెడల,
యితరులతో మనస్పర్ధలను కొనితెచ్చును.
కాని సజ్జనులతో స్నేహము చేసిన యెడల,
మనకు మంచి ప్రవర్తన, మనసులో ఆనందము అలవడి
సంఘములో గౌరవము కలుగును.
లలితసుగుణాల ఓ తెలుగుబాల!
మనకు సంపదలు ఎక్కువగా ఉన్న వేళ వేలాదిమంది ఆ సంపదను చూసి మనతో స్నేహము చేసెదరు.
ఆ సంపదలే మనము పోగొట్టుకొనిన వేళ ఆ వేలాది మందిలో చాల తక్కువ మంది మిత్రులుగా మిగిలియుండెదరు.
సంపదలు లేనివేళ మిగిలిన మిత్రులే మనకు నిజమైన ప్రాణమిత్రులు.
లలిత సుగుణాల ఓ తెలుగుబాల!
అడవిని కాల్చివేసే నిప్పు ఏ చెట్టు మీద పడితే ఆ చెట్టును కాల్చివేయును.
అటులనే గుణములేని వారు ఎవరితో స్నేహము చేసెదరో వారు గుణహీనులగుదురు.
కాని మంచి గుణములు కలిగినవారితో స్నేహము చేసిన యెడల
ఎత్తైన మలయ పర్వతము ఏవిధముగ చల్లని గాలిని అందరికి పంచునో,
ఆ స్నేహము మనకు కూడ మంచి గుణములను పంచును.