ఇంటిపని-1: పద్యములు, తాత్పర్యములు
పద్యములు:
కోరబోకు మెపుడు మేరమీరిన కోర్కె
చేరబోకు మెపుడు కౄర జనుల
మీరబోకు పెద్దవారు చెప్పిన మాట
లలిత సుగుణజాల తెలుగుబాల
బ్రతికినన్నినాళ్ళు ఫలములిచ్చుటెగాదు
చచ్చికూడ చీల్చి యిచ్చు తనువు
త్యాగభావమునకు తరువులే గురువులు
లలిత సుగుణజాల తెలుగుబాల
వీడు పరులవాడు వాడు నావాడని
అల్పబుద్ధి తలచు నాత్మయందు
సాధుపుంగవులకు జగమే కుటుంబము
లలిత సుగుణ జాల తెలుగుబాల
పైడిగద్దె మీద పట్టంబు కట్టిన
సిగ్గులేని కోతి మొగ్గలేసె
అల్పమతికి పదవి హాస్యాస్పదంబురా
లలిత సుగుణ జాల తెలుగుబాల
తాత్పర్యములు:
(Write once on pages 20, 41, 62, 81)
లలిత సుగుణాల ఓ తెలుగుబాల!
విపరీతమైన కోరికలను కోరుకొనకుము.
ఇతరులపట్ల దయలేనివారితో స్నేహము చేయకుము.
ఇంకా, సహృదయముతో పెద్దవారు చెప్పిన మంచిమాటలను అనుసరించుము.
లలిత సుగుణాల ఓ తెలుగుబాల!
చెట్లు తాము జీవించినంత కాలము ఇతరుల మేలుకొఱకు పండ్లను యిచ్చును.
అవి చనిపోయిన తరువాత కూడ ఇతరుల మేలుకొఱకే కలపను యిచ్చును.
త్యాగము ఎట్టిది అని బోధించుటకు ఆ చెట్లే మనకు గొప్ప గురువులు.
లలిత సుగుణాల తెలుగుబాల!
జ్ఞానమునందు పరిపక్వతలేని వారు తమ మనసులో
వీరు నావారు, వారు పరులవారు అను భేదభావముతో జీవించెదరు.
కాని జ్ఞానమునందు పరిపక్వత చెందిన సాధువులు
భేదభావములను విడిచి ఈ లోకమంతా ఒకే కుటుంబము అని తెలిసికొనెదరు.
లలిత సుగుణాల ఓ తెలుగుబాల!
కోతిని విలువైన బంగారపు సింహాసనము మీద కూర్చుండబెట్టి అధికారమును కట్టబెట్టిన,
ఆ కోతి ఆ సింహాసనపు విలువను తెలిసికొనక సిగ్గు విడిచి విన్యాసములు చేయును.
అటులనే తెలివి తక్కువవానికి పదవి లభించిన,
ఆ పదవి గొప్పతనమును అతడు తెలిసికొనక నవ్వులపాలు చేయును.