ఇంటిపని-4, ఒక నిమిషములో చదువుట
(గాజుల సత్యనారాయణ గారి "పెద్దబాలశిక్ష-2", పుట 174 లోని "మాట్లాడే గుహ" అనుసరణ)
ఒక అడవిలో ఒక పొట్టేలు దారి తప్పిపోయింది. చీకటి పడుతుండటంతో దగ్గర్లోనే కనిపించిన ఒక గుహలో ఆ రాత్రికి నిద్రపోయి మరుసటి రోజు ఉదయాన్నే మేతకు బయలుదేరింది.
ఈ విషయం గమనించిన ఒక పులి పొట్టేలు తిరిగివస్తే తినేయొచ్చు అనుకొని, ఆ గుహలోకి వెళ్ళి దాక్కుంది.
పొట్టేలు మధ్యాహ్నానికి తిరిగి ఆ గుహ దగ్గరకే వచ్చింది. కాని లోనికి వెళ్ళేముందు పెద్ద అడుగుజాడలను చూసింది. గుహలో ఏదైనా పులి దాక్కుని ఉందేమో తెలుసుకుందామని ఒక ఉపాయం పన్ని ఇలా అరిచింది:
"ఓ గుహ మిత్రమా! నన్ను చూసికూడా నిద్రపోతున్నావా? నన్ను ఆహ్వానించకపోతే నేను లోనికి రానని నీకు తెలుసు కదా? నన్ను ఆహ్వానించు".
ఆ మాటలకు గుహ లోపలున్న పులి 'ఓహో రోజూ గుహ పొట్టేలుని పిలుస్తుంది కాబోలు' అనుకుని "రా మిత్రమా రా" అంది.
ఆ శబ్దం విన్న పొట్టేలు, లోపల పులి దాక్కుందని గ్రహించి అక్కడి నుండి వేరేచోటికి పరుగుతీసింది.