ఇంటిపని-1: పద్యములు, తాత్పర్యములు
పద్యములు:
కష్ట పెట్టబోకు కన్నతల్లి మనసు
నష్ట పెట్టబోకు నాన్న పనులు
తల్లిదండ్రులన్న దైవసన్నిభులురా
లలిత సుగుణజాల తెలుగుబాల
తెనుగుదనము వంటి తీయదనము లేదు
తెనుగు కవులవంటి ఘనులు లేరు
తెనుగుతల్లి సాధుజన కల్పవల్లిరా
లలితసుగుణ జాల తెలుగుబాల
అడవి గాల్చువేళఁ నగ్నికి సాయమై
నట్టి గాలి దీప మార్పివేయు
బీదపడిన వేళ లేదురా స్నేహంబు
లలిత సుగుణజాల తెలుగుబాల
దొరలు దోచలేరు, దొంగలెత్తుక పోరు
భ్రాతృ జనము వచ్చి పంచుకోరు
విశ్వవర్ధనంబు విద్యాధనమ్మురా
లలిత సుగుణజాల తెలుగుబాల
తాత్పర్యములు:
Write on pages: 20, 37,54,78
లలిత సుగుణాల ఓ తెలుగుబాల!
కన్న తల్లి మనసును కష్ట పెట్టకుము.
కన్న తండ్రి పనులను నష్ట పెట్టకుము.
ఎందుకనగా తల్లిదండ్రులు దైవసమానులు.
లలిత సుగుణాల ఓ తెలుగుబాల!
ఇటు భాష, సంస్కృతులలో తెలుగు కంటె తీయనైనది వేరొకటి లేదు.
అటు కావ్య నిర్మాణములో తెలుగు కవులను మించిన వారు వేరొకరు లేరు.
అంతేకాదు. సాత్విక జీవనమును జీవించువారలకు తమ కోరికలు తీరు
మార్గములు కూడా తెలుగు భాష, సంస్కృతులయందు కలవు.
నిప్పు పెద్దదిగ మారినపుడు వీచేగాలి ఆ నిప్పుకు సహాయపడి అడవిని కాల్చి వేయును.
కాని అదే నిప్పు చిన్నదిగ మారి ఒక దీపమైయున్నప్పుడు వీచేగాలి ఆ దీపమును ఆర్పివేయును.
అటులనే మనకు ధనము కలిగినపుడు కొందరు స్నేహితులుగా మారి దగ్గరయ్యెదరు.
కాని ధనము లేని వేళ ఆ స్నేహితులే దూరమగుదురు. కనుక స్నేహితులను జాగ్రత్తగా ఎన్నుకొనవలెను.
లలిత సుగుణాల ఓ తెలుగుబాల!
మన విద్యాసంపద లోక కల్యాణము కొఱకే.
ఆ సంపదను అధికారము గల రాజులు దోచలేరు.
తెలియకుండా దొంగలు తీసుకుపోలేరు.
ఇంకా తోడబుట్టినవారు కూడా భాగములు చేసి పంచుకోలేరు.
అట్టి గుణము కలది విద్యాధనము.