హరినామ కథన దావానల జ్వాలచేఁ గాలవే ఘోరాఘ కాననములు!
వైకుంఠ దర్శన వాయు సంఘంబు చేఁ దొలగవే భవ దుఃఖ తోయదములు!
కమలనాభ ధ్యాన కంఠీరవంబుచేఁ గూలవే సంతాప కుంజరములు!
నారాయణ స్మరణ ప్రభాకరదీప్తిఁ దీరవే షడ్వర్గ తిమిరతతులు!

నలిన నయన భక్తి నావచేఁ గాక సం
సార జలధి దాఁటి చనగ రాదు
వేయునేల! మాకు విష్ణు ప్రభావంబు
దెలుపవయ్య సూత! ధీ సమేత!
ఛందస్సు (Meter): వచనము
స్కంధము (Chapter): 1
సంఖ్య (Number): 50