కంజాక్షునకుఁ గాని కాయంబు కాయమే పవనగుంఫిత చర్మ భస్త్రి గాక
వైకుంఠుఁ బొగడని వక్త్రంబు వక్త్రమే ఢమ ఢమ ధ్వనితోడి ఢక్క గాక
హరిపూజనము లేని హస్తంబు హస్తమే తరుశాఖ నిర్మిత దర్వి గాక
కమలేశుఁ జూడని కన్నులు కన్నులే తనుకుడ్యజాల రంధ్రములు గాక

చక్రి చింతలేని జన్మంబు జన్మమే
తరళ సలిలబుద్బుదంబు గాక
విష్ణుభక్తి లేని విబుధుండు విబుధుఁడే
పాదయుగముతోడి పశువు గాక.
ఛందస్సు (Meter): సీసము, ఆటవెలది
స్కంధము (Chapter): 7
సంఖ్య (Number): 170