1.1 పోతన - గంగానదీ తీరము
పోతన: [ఈ క్రింది పద్యమును పాడుచూ వేదికపై నడచుచుండును]
చేతులారంగ శివునిఁ బూజింపడేని
నోరు నొవ్వంగ హరికీర్తి నుడువఁడేని
దయయు సత్యంబు లోనుగాఁ దలఁపడేని
గలుగనేటికిఁ దల్లుల కడుపుఁ జేటు.
పోతన:
నాపూర్వజన్మ సహస్ర సంచిత తపఃఫలంబున శ్రీమన్నారాయణుని పుణ్య కథలను వ్రాయవలెనని కుతూహలముగానున్నది. ఇది పున్నమిరాత్రి. సజ్జన సమ్మతమున పొంగిపొరలే ఈ గంగాస్నానము చేసితిని, ఇక ఆ మహేశ్వర ధ్యానము చేసెదను.
పోతన:
[కూర్చుని ధ్యానము చేసికొనుచుండును. కొంచెం సేపాగి కనులు తెరచి]
ఆహా సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడు నా కన్నుగవకు కనిపించుచుండెనుకదా.
మెఱుఁగు చెంగట నున్న మేఘంబు కైవడి నువిద చెంగట నుండ నొప్పువాఁడు
చంద్రమండల సుధాసారంబు పోలిక ముఖమునఁ జిఱునవ్వు మొలచువాఁడు
వల్లీయుత తమాల వసుమతీజము భంగి బలువిల్లు మూఁపునఁ బరఁగువాఁడు
నీల నగాగ్ర సన్నిహిత భానుని భంగి ఘన కిరీటము దలఁ గలుగువాఁడు.
పుండరీకయుగముఁ బోలు కన్నులవాఁడు
వెడఁద యురమువాఁడు, విపులభద్ర
మూర్తివాఁడు రాజముఖ్యుఁడొక్కరుఁడు నా
కన్నుఁగవకు నెదురఁ గానఁబడియె.
పోతన:
శ్రీరామా! ఏమందువు? నా భవబంధములు తెగుటకు శ్రీమహాభాగవతమును తెనుగు సెయమందువా? నీ ఆనతి.
పలికెడిది భాగవతమట!
పలికెంచెడి వాడు రామభద్రుండట! నేఁ
బలికిన భవహరమగునట!
పలికెద వేఱొండుగాథఁ బలుకఁగ నేలా?
భాగవతము దెలిసి పలుకుట చిత్రంబు!
శూలికైనఁ దమ్మిచూలికైన!
విబుధ జనులవలన విన్నంత కన్నంత
తెలియ వచ్చినంత తేటపఱుతు.
[కొందఱకుఁ దెనుగు గుణమగుఁ....; ఒనరన్ నన్నయ తిక్కనాది కవులీయుర్విం...; లలిత స్కంధము, కృష్ణమూలము...]
పోతన:
[తాటియాకులపై భాగవతమును కొంచెంసేపు వ్రాయుచుండును.]
[ఇద్దరు శిష్యులు వచ్చెదరు.]
శిష్యుడు-1: నమస్కారం గురువర్యా!
శిష్యుడు-2: నమస్కారం గురువర్యా!
పోతన: నమస్కారం నాయనలారా!
1.2. పోతన గారి శిష్యులు భాగవత పద్యములను అభినందించుట
పోతన:
శిష్యులారా, నేను కొంచెం సేపు దేవాలయమునకు వెళ్ళి వచ్చెదను.
ఈ భాగవతానువాదమునగల కొన్ని పద్యములను చదువుకొనుము.
[పోతనగారు వెడలి పోవును.]