శమీకుడు/మునిబాలకులు: [ఈ క్రింది పోతన పద్యమును పాడును]
ఫాలము నేల మోపి, భయభక్తులతోడ నమస్కరించి, భూ
పాల కులోత్తముండు గరపద్మములన్ ముకుళించి, నేడు నా
పాలిటిభాగ్య మెట్టిదియొ, పావనమూర్తివి పుణ్యకీర్తి వీ
వేళకు నీవు వచ్చితి వివేకభూషణ! దివ్య భాషణా!
పరీక్షిత్తు:
గురుడవు, యోగివిభుడవు. నేడో, రేపో దేహాన్ని విడిచేనాకు ముక్తిమార్గమును తెలుపుము. ఏమి జపించిన, ఏమి తలంచిన, ఏమి చేసిన, ఏమి గావించిన, ఎన్నడు ముక్తి కలుగును?
శుకుడు:
రాజా! నీవు భాగవతుడవు. మరణము సిద్ధమని తెలిసిన వారు వేలాది ప్రశ్నలు అడిగెదరు, కాని నీవిటువంటి ప్రశ్న అడుగుట నిజముగా వరము.
- [అందరు కూర్చొనియుందురు.] -
శుకుడు:
అన్నిభూతములలో భగవానుడు గలడు, భగవంతుడు లేని పదార్థము ఈ సృష్టిలో ఒక్క అణువు కూడా లేదు. నేల, నింగి, నీరు, నిప్పు, గాలి - వీటన్నిటా భగవంతుడైన ఆ హరి గలడు. నిజానికి ఆయన నిర్గుణ స్వరూపుడు. సంసారంలో ప్రవేశించిన వారికి తపస్సు, యోగము అను పెక్కు మార్గములు గలవు. కాని, భక్తి మార్గముకంటె సులభము వేరొకటి లేదు.