3.5 పరీక్షిత్తు శాపమును తెలిసికొని స్పందించుట, వేదపండితులను రమ్మనుట
(ప్రదేశము: పరీషిత్తు రాజభవనము)
- పరీక్షిత్తు సింహాసనము దిగి నిలబడి యుండును. మంత్రి నిలబడి యుండును. పరీక్షిత్తు కుమారుడు జనమేజయుడు ఆవేశముతో కనిపించును.
- గౌరుడు నమస్కరించుచు ఒక మూలగా యుండి, నేలవైపు చూచును.
జనమేజయుడు:
ఏరా మునిబాలకా! మారాజ్యంలోనే ఉంటూ, రాజుగారినే శపించెదరా? ఎంత అహంకారము? తండ్రీ, ఆజ్ఞాపించండి, ఇప్పుడే వెళ్ళి ఆ మునిబాలకుని తల వేయి ముక్కలు జేసి, మీముందుంచెదను. నేనీ కోపమును తాళలేను.
జనమేజయుడు:
ఆజ్ఞాపించండి తండ్రీ! ఆజ్ఞాపించండి. ప్రజలకు పాలకులపై గౌరవమర్యాదలు లేకున్న దేశమేగతిపాలవును?
- కొద్ది క్షణాలపాటు నిశ్శబ్దము, రాజు ఏమీ మాట్లాడకుండును.
జనమేజయుడు:
మంత్రివర్యా! మీరైనా రాజుగారికి నచ్చచెప్పండి. ఆయన ఆజ్ఞను శిరసా వహించడానికి సిద్ధంగా ఉన్నాను.
మంత్రి: రాజా, మీరేమీ పలుకరు. మౌనమే అంగీకారమా?
పరీక్షిత్తు:
లేదు మంత్రీ! లేదు. జనమేజయ! వేగిరపడకు. ఒకతప్పును వేరొక తప్పుతో సరిచేయగలమా? ఎంత చిన్న తప్పిదమైనా, నేను చేసినది నేరమే! కష్టాలలో ఉన్నపుడే మనిషి నిజస్వరూపము బయటపడును. ఇన్ని సంవత్సరాలు ధర్మబద్ధముగా పాలించుచున్ననూ, రాజుననే అహంకారము నాలో ఇంకా చావలేదు. మా తాతగారైన ధర్మరాజు ఒక ముంగిస చెప్పిన కథ గుర్తులేదా?
- కొద్ది సేపు అంతా నిశ్శబ్దము -
పరీక్షిత్తు:
జనమేజయ! నేడే నీ పట్టాభిషేకమునకు తయారుకమ్ము. భటులారా! జనమేజయుని పట్టాభిషేకానికి పురోహితులను, బలములను తయారుచెయ్యండి. (కొంచెం ముందుకు నడచును, మంత్రివైపు తిరుగును).
పరీక్షిత్తు:
మంత్రీ! నాకాలము దగ్గరైనది. ఒక మనిషి కి ఏడు రోజులలో మరణము సంభవించునని తెలిసినపుడు, చేయవలసిన కర్తవ్యమేమిటి?
మంత్రి:
[కొద్దిసేపాగి] రాజా, ఆజ్ఞాపించండి, మన రాజ్యంలోని వేద విభులను, పండితులనందరిని కొనితెచ్చెదము. వారు మీ మనోవ్యాకులమును తప్పక నివారింపగలరు.
పరీక్షిత్తు: సరే, అలాగే చేయండి, మీరాపనిలో ఉండండి.
మంత్రి: సెలవు (వెడలిపోవును).
పరీక్షిత్తు:
మునిబాలకా! నీవిక వెళ్ళవచ్చు. ఒక మనిషిగా నాకర్తవ్యమును తెలిసికొనుటకు ఇదే నాకు కలిగిన వరముగా భావించెదను. (మునిబాలకుడు వెడలిపోవును.)
జనమేజయుడు:
తండ్రీ, ఏమిటీ ఘోరము? ఒంటి కాలి స్థంభముతో ఒక గదిని కట్టించెదమా? మీ ఆయుస్సు కోసం ఆయుష్టోమం చేయిస్తాను. సర్పములనన్నింటిని నేను హతమార్చగలను.
పరీక్షిత్తు:
జనమేజయ! ప్రతి మనిషికి మరణము తధ్యము. నేను అదృష్టవంతుడను ఎందుకంటే నేను ఎన్ని రోజులు జీవించెదనో నాకు నిశ్చితంగా తెలిసినది, ఇక నా కర్తవ్యాన్ని తెలుసుకొనవలెను. వెళ్ళు, వెళ్ళి నీ పట్టాభిషేకానికి తయారుగా.