3.4 శమీకుడు శృంగిని మందలించుట, రాజు శాపమును తెలిసికొనుట
(ప్రదేశము: శమీకుని కుటీరము)
- శమీకుడు మెల్లగా తన సమాధినుండి బయటకు వచ్చి, నిలబడి, మూడు సార్లు గుండ్రముగా తిరిగి,
నలుదిక్కుల నమస్కరించి, తన కమండలమును పట్టుకొని శృంగి, గౌరుడు ఉన్న చోటుకు నడచును.
- శృంగి, గౌరుడు ఆయనను గమనించక సంభాషించుకొనుచుందురు.
గౌరుడు: [శృంగితో] అరే శృంగీ! నీవు తొందరపడినావేమోనని నా సందేహము. శృంగి: తప్పు చేసిన వారిని శిక్షించవలె కదా? గౌరుడు: నిజమే! కానీ మనము బాలకులం కదా, మరి పెద్దవారిని శిక్షించవచ్చా? శృంగి: ఎంచక్క శిక్షించవచ్చు. చూడు, నేటికి ఏడవనాట ఆ రాజు మరణించును.
శమీకుడు: [ఈ సంభాషణను విని] ఏమిరా! ఎవరిగురించి మీ సంభాషణ? రాజు ఎందుకు మరణించును? గౌరుడు:
[నమస్కరించి] గురువర్యా! మీరు సమాధిలో ఉండగా, మన రాజు మీ మెడలో ఒక చచ్చిన పామును వేసి వెళ్ళెను. మరి శృంగి అది తెలిసికొని రాజు కు నేటికి ఏడవనాట మరణము సంభవించునని శపించెను.
శమీకుడు: [తాత్కాలికముగా చెవులు మూసికొని, పైకి చూసి] పరమేశ్వరా! ఎంత తప్పిదము జరిగినది?
శమీకుడు:
శృంగీ! నిజా, నిజాలు ఏమిటో పూర్తిగా తెలిసికోకుండా, ఆలోచనలేక ఇటువంటి పనులు చేయవచ్చునా? అయినా నామీద వేసినది చచ్చిన పామేకదా? ఆయన ఎటువంటి బాధలో ఉన్నాడో ఏమిటో! రాజు మరణిస్తే రాజ్యం ఏమైపోవును? అధర్మము చెలరేగును. ఎంత ధర్మనిష్టతో పరీక్షిన్మహరాజు రాజ్యాన్ని పరిపాలించుచున్నాడో గ్రహించితివా? హరి హరీ! ఎంత ఘోరము జరిగినది.
శమీకుడు: శృంగీ! నీ శాపమును తక్షణమే వెనుకకు తీసికొనుము నాయనా. శృంగీ: నన్ను క్షమించండి తండ్రీ! శాపమును వెనుకకు తీసికొను శక్తి నాకు లేదు. శమీకుడు:
హరి హరి! చూడు నాయనలారా! కొట్టినా తిట్టినా పరమభాగవతులు భరిస్తారే కాని, ప్రతీకారం తీర్చుకోరు. మన రాజు ఒక పరమభాగవతుడు. నీ శాపానికి ఆయన ప్రతీకారం తీర్చుకొనడు. సాధులు ఉపకారానికి పొంగిపోరు, అపకారానికి కుంగిపోరు. హరి హరి! హరి హరి!
- శమీకుడు హరి హరి అంటు అటు ఇటు తిరుగును. శృంగి, గౌరుడు నమస్కరించుచు ఆయన వెంట తిరుగును. -
శమీకుడు:
నాయనా శృంగీ! నీవు వెంటనే పరీక్షిన్మహరాజు చెంతకేగి, జరిగిన సంగతులను తెలియజేయి.
శృంగి: అలాగే తండ్రీ! (వెళ్ళబోవును) శమీకుడు:
ఆగు నాయనా ఆగు! శపించిన నీవే ఈ సమాచారమును రాజుకు చేరవేయుట సమంజసముగా లేదు. నాయనా గౌరా!
గౌరుడు: గురువర్యా, సెలవివ్వండి!
శమీకుడు:
చూడు నాయనా! ఈ విషయాలన్ని రాజుకు వినిపించి, శృంగి చింతించుచున్నాడని చెప్పుము. జరిగినదానికి మన్నింపు కోరు నాయనా!
గౌరుడు: అలాగే గురువర్యా! సెలవు. (గౌరుడు వెడలిపోవును)